మందులిచ్చే బుల్లి రోబోలు!

26 Nov, 2017 02:56 IST|Sakshi

మోటార్‌బైక్‌లో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం?  
ఏ భాగంలో ఇబ్బంది ఉందో చూసుకుని సరిచేసే ప్రయత్నం చేస్తాం! 
మరి మన శరీరంలోని ఏదైనా అవయవానికి సమస్య వస్తే..? 
నేరుగా ఆ భాగానికైతే మందివ్వలేం కదా.. 
ఇకపై అలా కాదు.. చిన్న చిన్న రోబోలు తయారవుతున్నాయి..  
ఇవి నేరుగా వ్యాధిసోకిన భాగాలకే వెళ్లి మందులిచ్చేస్తాయి మరి.. 
ఆ రోబోల కథ మీ కోసం..  

నాచు.. అదే శైవలాలు అంటారు... హాంకాంగ్‌లోని చైనీస్‌ యూనివర్సిటీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం వీటిని బయోహైబ్రిడ్‌ రోబోలుగా మార్చేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మీటర్‌ కన్నా కొన్ని లక్షల రెట్లు తక్కువ పొడవుండే ఈ రోబోలతో వ్యాధులతో నేరుగా పోరాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జబ్బు పడ్డ ఏ అవయవానికైనా నేరుగా మందులు అందించవచ్చని భావిస్తున్నారు. కేన్సర్‌ సోకిన ఎలుకలపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో మానవుల్లో కూడా సానుకూల ఫలితాలు రాబట్టొచ్చని అంచనా. స్పిరులినా ప్లాటెన్సిస్‌ అనే నాచుమొక్కకు అయ స్కాంత కణాలు జోడించి.. రసాయన పూత పూస్తే బుల్లి హైబ్రిడ్‌ రోబో సిద్ధమైపోతుంది. అయస్కాంత కణాలు ఉంటాయి కాబట్టి వీటిని శరీరం బయటి నుంచి కూడా నియంత్రించొచ్చు. దాదాపు 10 లక్షల రోబోలను ఒక్కసారి ప్రయోగించినా సరే.. ఒకదానితో ఒకటి అతుక్కోకుండా నేరుగా అవసరమైన చోటికి వెళతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కీ ఝౌ తెలిపారు. వాటంతట అవి నాశనమవుతూ వాటిల్లోకి జొప్పించిన మందులను విడుద ల చేస్తాయన్నారు. పైపూత మందాన్ని మార్చడం ద్వారా ఇవి ఎంత కాలానికి నాశనం కావాలో మనమే నిర్ణయించొచ్చు. ఎలుకలపై వీటిని ప్రయోగించినప్పుడు నేరుగా కేన్సర్‌ కణాలపై మాత్రమే దాడి చేశాయని గుర్తించారు. ఈ రోబోల తయారీ సులువు కావడంతో చికిత్సలకయ్యే ఖర్చు తగ్గే అవకాశముందని చెబుతున్నారు.    

ఉపయోగాలేంటి? 
వ్యాధుల నిర్ధారణతో పాటు బోలెడన్ని ఉపయోగాలున్నాయి. పరిసరాల్లో జరుగుతున్న రసాయన మార్పులను కూడా ఇవి గుర్తించగలవు. ఏదైనా వ్యాధి వచ్చే ముందు శరీరంలో చోటు చేసుకునే రసాయనిక మార్పులను గుర్తించొచ్చు. ఇవి ఎక్కడున్నాయో గుర్తించడం కూడా చాలా సులువు. చర్మానికి దగ్గరగా ఉంటే వాటి సహజమైన ప్రతి దీప్తి ద్వారా.. శరీరం లోపల ఉంటే ఎంఆర్‌ఐ యంత్రం ద్వారా వీటిని గుర్తించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

మరిన్ని వార్తలు