కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ల దాడి

27 Sep, 2017 16:50 IST|Sakshi

సాక్షి : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్ బుధవారం ఉదయం రాకెట్ల పేలుళ్లతో దద్దరిల్లింది.  హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ దాడి చోటు చేసుకున్నట్లు సమాచారం. 

ఉదయం 11.15 గంటలకు మొదలైన ఈ దాడి సుమారు గంటన్నర పాటు కొనసాగినట్లు చెబుతున్నారు. 20 నుంచి 30 రాకెట్లు విమానాశ్రయంపై వచ్చి పడ్డాయని స్థానిక మీడియా టోలో న్యూస్‌ వెల్లడించింది.  అయితే దాడి చేసిన వారి లక్ష్యం ఎయిర్‌ పోర్ట్‌ అయి ఉండదని..  నాటో దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అమెరికా రక్షణ కార్యదర్వి జేమ్స్‌ మాటిస్ కాబూల్‌ పర్యటన నేపథ్యంలోనే ఈ దాడి చోటుచేసుకోవటం గమనార్హం.

దాడిలో ఎవరైనా మరణించారా, ఎంత మంది గాయపడ్డారన్న వివరాలు వెంటనే వెల్లడికాలేదు. దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరూ ప్రకటించుకోలేదు.

భారత పర్యటనలో భాగంగా జేమ్స్‌ మాటిస్‌ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, జాతీయ భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అటునుంచి అటు అఫ్ఘాన్‌ పర్యటనకు వెళ్లిన మాటిస్‌ నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌తోపాటు అధ్యక్షుడు అష్రఫ్‌ గనితో కూడా సమావేశం అయ్యారు.

మరిన్ని వార్తలు