రోహిత్ కోసం ప్రపంచ స్కాలర్ల లేఖ..!

20 Jan, 2016 19:57 IST|Sakshi
రోహిత్ కోసం ప్రపంచ స్కాలర్ల లేఖ..!

ప్రపంచ పండిత సమాజం ఏకమైంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇప్పుడు భారత్ తో పాటు, దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్లను ఏకతాటిపైకి తెచ్చింది. భారత ఉన్నత విద్యలో కుల వివక్షపై న్యాయ పోరాటానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని విద్యావంతులు, ప్రొఫెసర్లు సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఐదుగురు దళిత పీహెచ్ డీ విద్యార్థులను వర్శిటీ నుంచి బహిష్కరించడం కుల వివక్షకు తార్కాణమని.. విద్యార్థులు కనీసం మాట్లాడేందుకు అనుమతించకుండా రాజకీయ ఒత్తిడులతో వారిని బహిష్కరించడం అన్యాయమని, ఈ విషయంలో వెంటనే న్యాయం విచారణ చేపట్టాలని వారు లేఖలో డిమాండ్ చేశారు.  

విద్యార్థులపై పాలకుల పక్షపాత వైఖరి, రాజకీయ నాయకుల ప్రమేయం భయంకర పరిణామాలకు దారితీస్తోందని ప్రపంచ స్కాలర్ల సమాజం ధ్వజమెత్తింది. యూనివర్శిటీ బహిష్కరించిన ఐదుగురు దళిత విద్యార్థుల్లో ఒకరైన స్కాలర్ స్టూడెంట్ వేముల రోహిత్.. వర్శిటీ బహిష్కరణ తన గుర్తింపునకు భగం కలిగించిందన్న నిరాశకు లోనయ్యాడని.. తక్షణ గుర్తింపుకోసం స్వంత జీవితాన్నేబలి చేసుకున్నాడని వారంటున్నారు.  ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల మేధో, వ్యక్తిగత అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన ప్రాధమిక బాధ్యతలో విద్యా సంస్థలు వైఫల్యం చెందుతున్నాయని ఆరోపించారు.  సంస్థల్లో సమస్యలను చక్కగా పరిష్కరించలేని పరిస్థితుల్లో రోహిత్ వంటి దళిత విద్యార్థులెందరో వివక్ష, నిరాశలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ స్కాలర్ల సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.

వెంటనే రోహిత్ సహ విద్యార్థులు నలుగురినీ విచారించాలనీ, రోహిత్ కుటుంబానికి సహకారం అందించడంతోపాటు... అతడి ఆత్మహత్యపై ప్రత్యేకంగా పోలీస్ విచారణ జరిపించాలని దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్స్... హైదరాబాద్ వర్శిటీ  అధికారులను కోరారు.  ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ విచారణ చేపడితే సరిపోదని, భవిష్యత్తులో కూడ ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

 

రోహిత్ వంటి విద్యార్థుల పౌర జీవితంతోపాటు వారి ఆరోగ్యవంతమైన రాజకీయ చర్చకు విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలన్నారు.  భారత విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం, కుల వివక్ష ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ప్రతికూల కీర్తికి దోహదపడుతోందన్నారు. గౌరవ ప్రదమమైన, మంచి వాతావరణంలో విద్యాబోధన సాగించడంతోపాటు వర్శిటీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు