రోమ్లో సంచలనం: ఫైవ్స్టార్ క్వీన్కు పట్టం

20 Jun, 2016 17:53 IST|Sakshi

చారిత్రక రోమ్ నగరంలో ఓ 37 ఏళ్ల మహిళ సంచలనం సృష్టించింది. ప్రపంచ ఆథ్యాత్మిక కేంద్రమైన వాటికన్ను ఎదిరించిన ఆమె.. తరతరాలుగా వేళ్లూనుకుపోయిన మాఫియాకు చుక్కలు చూపిస్తానని ప్రకటించింది. జనం ఆమె వాగ్ధానాలను నమ్మారు. ఫైవ్ స్టార్ మూమెంట్ పార్టీ కీలక నేతగా ఇప్పటికే పాపులర్ అయిన విర్జినియా రగ్గిని ఓటర్లు భారీ మెజారిటీతో రోమ్ మేయర్ గా ఎన్నుకున్నారు. సోమవారం వెల్లడైన రోమ్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో విర్జీనియా పార్టీ ఫైవ్ స్టార్ మూమెంట్ ఏకంగా 55 శాతం ఓట్లను కొల్లగొట్టి విజయఢంకా మోగించింది.

ప్రభుత్వ యంత్రాంగంలో విచ్చలవిడి అవినీతి, మాఫియా జోక్యం, మరో వైపు వాటికన్ శాసనాలతో రోమ్ నగర ఆర్థిక, శాంతిభద్రతల పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా క్షీణించిన నేపథ్యంలో అన్ని పార్టీలూ స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. భారీ కుంభకోణాలు వరుసగా వెలుగులోకి రావడంతో మితవాద పార్టీకి చెందిన మేయర్‌ జియాన్ని అలెమన్నో గత అక్టోబర్ లో రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ మేయర్ బరిలో పోటీకి దిగిన ఆయనకు వామపక్ష అభ్యర్థి ఇగ్నాజియో మరినో గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఓటర్లు అనూహ్యంగా ఫైవ్ స్టార్ పార్టీ అభ్యర్థిని విర్జీనియాకు పట్టంకట్టారు.


565 స్థానాలున్న గ్రేటర్ రోమ్ కార్పొరేషన్ జనాభా దాదాపు 40 లక్షలు. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఫైవ్ స్టార్ విర్జీనియాకు మొత్తం 4,53,806 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి వామపక్ష పార్టీకి చెందిన ఇగ్నాజియోకు 3,20,170 ఓట్లు మాత్రమే దక్కాయి. నిజానికి ఇటలీ రాజకీయాల్లో హై ప్రొఫైల్ నేరగాళ్లు, వేశ్యలు, మతాధికారుల ప్రాబల్యం ఎక్కువ. అలాంటిది ఏళ్లుగా పేరుకుపోయిన రాజకీయ కుళ్లును విర్జీనియా కడిగేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే రోమ్ వాసులు.. ' ఆమె ఫిడేలు వాయించే రకం కాదు..' అంటూ విర్జీనియాపట్ల నమ్మకాన్ని ప్రకటిస్తున్నారు.

(రోమ్ ఆఖరి చక్రవర్తి నీరో జూలియో క్లాడియన్.. తల్లిని, సవతి తమ్ముడును చంపి అధికారంలోకి వచ్చాడు. రాజ్యంలో తిరుగుబాటు చెలరేగి రోమ్ నగరం తగలబడుతుండగా తాపీగా పిడేల్ వాయిస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ అసమర్థతకు గుర్తుగా 'రోమ్- మంటలు- నీరో- ఫిడేల్' సామెత ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే)

 

మరిన్ని వార్తలు