ఇంటి పైకప్పే ఏసీ

6 Jun, 2015 08:50 IST|Sakshi
ఇంటి పైకప్పే ఏసీ

సిడ్నీ: మనకు వేసవి కాలం ముగిసి వర్షాకాలం రాబోతోంది. త్వరలో వేసవి నుంచి ఉపశమనం పొందనున్నాం. కానీ ఆస్ట్రేలియాలో ఇప్పుడే వేసవి మొదలవుతోంది. అక్కడివారు కూడా మనలాగే ఈ ఎండల్ని ఎదుర్కోవడమెలాగా అని భయపడిపోతున్నారు. అయితే ఎండ ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడి పరిశోధకులు ఓ కొత్త సాంకేతికతను కనుగొన్నారు. సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఇంటిపైకప్పునే ఏసీగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీని ద్వారా ఇళ్ల పైకప్పుల్తోనే ఇల్లంతా చల్లదనం పరుచుకుంటుంది.

ఎలాగంటే: ఇంటి పైకప్పులకు చల్లదనాన్నిచ్చే కొత్త రకం పదార్థాన్ని పరిశోధకులు తయారు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించిన పదార్థంతో ఒక పొర తయారు చేసి, దాన్ని వెండి పొర మీద పేర్చారు. ఈ రెండింటి కలయికతో ఏర్పడిన పదార్థం వేడిని నిలవనివ్వదు. దీంతో ఈ పదార్థంతో తయారు చేసిన పై కప్పులు ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా వేడెక్కవు. ఫలితంగా ఇంటిలోపల చల్లదనం పరుచుకుంటుంది.

దాదాపు 50 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడిని తగ్గించే సామర్థ్యం ఈ కప్పులకు ఉంటుంది. ఈ కప్పులను వాడడం వల్ల ఇంటిలోపలికి వేడి రాకుండా నిరోధించవచ్చు. సాధారణంగా ఇంటి పైకప్పులు వేడెక్కడం వల్ల ఇళ్లల్లోకి వేడిగాలి వస్తుంటుంది. ఈ సమస్యలన్నింటినీ ఈ కొత్త రకం కప్పులతో ఎదుర్కోవచ్చు. పైగా దీనికి ఏసీల కంటే తక్కువ విద్యుత్ అవసరం. ప్రస్తుతం మార్కెట్‌లో లేకపోయినా త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని వార్తలు