ఆర్మ్‌స్ట్రాంగ్‌ బ్యాగుకు రూ.11 కోట్లు

22 Jul, 2017 03:16 IST|Sakshi
ఆర్మ్‌స్ట్రాంగ్‌ బ్యాగుకు రూ.11 కోట్లు
చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అప్పట్లో వాడిన ఓ బ్యాగు గురువారం ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. సౌత్‌బే నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ద్వారా దీన్ని కొనుగోలు చేశారు. 1969లో అపోలో–11 నౌక ద్వారా నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్‌లు చంద్రుడిపైకి చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక తిరిగొచ్చాక అందులోని వస్తువులన్నింటినీ స్మిత్‌సోనియన్‌ సంస్థకు ఇచ్చేశారు.

అయితే ఈ క్రమంలో జరిగిన ఒక తప్పిదం వల్ల చంద్రుడిపై నమూనాలు సేకరించేందుకు వాడిన ఓ బ్యాగు జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లోనే ఉండిపోయింది. బ్యాగు ప్రాముఖ్యం తెలియని వారు కొందరు దీన్ని పారేయబోతూ కన్సాస్‌లోని ఓ ప్రైవేట్‌ మ్యూజియం యజమానికి చూపించారు. కొంత కాలం తర్వాత ఓ చోరీ కేసులో ఈ యజమానికి శిక్ష పడటంతో ఎఫ్‌బీఐ ఈ బ్యాగును స్వాధీనం చేసుకుని 2015లో అతి కష్టమ్మీద 995 డాలర్లకు అమ్మింది. ఇప్పుడు మళ్లీ రూ.11 కోట్ల 58 లక్షల 25 వేల 5 వందల యాభై రూపాయలకు అమ్ముడుబోయిందీబ్యాగు.
మరిన్ని వార్తలు