ఆయనకు 84.. ఆమెకు 59.. మళ్లీ పెళ్లి!

12 Jan, 2016 15:01 IST|Sakshi
ఆయనకు 84.. ఆమెకు 59.. మళ్లీ పెళ్లి!

అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, చైనా దేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన 'న్యూస్ కార్పొరేషన్' ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపర్ట్ ముర్దోక్ తన 84వ ఏట మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ముగ్గురు భార్యలతో ఇప్పటికే ఆరుగురు పిల్లలున్న ముర్దోక్.. ఇప్పుడు నాలుగో పెళ్లిగా నలుగురు పిల్లలున్న 59 ఏళ్ల జెర్రీ హాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. వందల కోట్ల రూపాయల భరణాన్ని చెల్లించి తన ముగ్గురు భార్యలకు ముర్దోక్ విడుకులివ్వగా, 'రోలింగ్ స్టోన్' రాక్ ట్రూప్‌లో ఫ్రంట్ మేన్ మిక్ జాగర్ 1990లో పెళ్లి చేసుకొని 1999లో ఆయనకు విడాకులు ఇచ్చిన జెర్రీ హాల్.. 16 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటున్నారు.

గత అక్టోబర్ నెల నుంచి డేటింగ్ చేస్తున్న ముర్దోక్, జెర్రీహాల్‌ ఇద్దరూ బెవర్లీ హిల్టన్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై చేతులో చెయ్యేసి నడవడంతో హాలీవుడ్ సెలబ్రెటీలలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. వాటిని నిజంచేస్తూ తాము త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నామంటూ 'ది టైమ్స్' పత్రికలో ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చారు. 'ప్రుడెన్స్, ఇలిసాబెత్, లచ్లాన్, జేమ్స్, గ్రేస్, క్లో ముర్దోక్‌లకు తండ్రైనా రూపర్ట్ ముర్దోక్, ఎలిజబెత్, జేమ్స్, జార్జియా, గాబ్రియెల్ జాగర్‌లకు తల్లైనా జెర్రీ హాల్ ఎంగేజ్‌మెంట్ నిశ్చయమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం' అని ఆ క్లాసిఫైడ్ యాడ్‌లో ప్రకటించారు.

'ది టైమ్స్' పత్రికను 'న్యూస్ కార్పొరేషన్' సంస్థ వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి పలు పత్రికలను ప్రచురిస్తున్న ఈ సంస్థ వందకుపైగా టీవీ ఛానళ్లను కూడా నడుపుతోంది. సంపాదనపరంగా న్యూస్ కార్పొరేషన్ నాలుగో అతిపెద్ద మీడియా సంస్థ. హాలీవుడ్‌లో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్' సంస్థ కూడా ఈ మీడియా సంస్థలో భాగమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఇదే సంస్థ నుంచి వెలువడుతున్న 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' అనే పత్రికను మూసివేయాల్సి వచ్చింది.

అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టిన ముర్దోక్, జెర్రీ హాల్‌ అదే నెలలో జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్‌లో పబ్లిక్‌గా మొదటిసారి కనిపించారు. రెండోసారి గోల్డెన్ గ్లోబ్ పోటీల్లోనే కనిపించారు. వారిద్దరు పీకలోతు ప్రేమలో మునిగిపోయారని, వారు పెళ్లి చేసుకోవడం పట్ల తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ముర్దోక్ పిల్లలు, జెర్రీ హాల్ పిల్లలు మీడియా ముందు వ్యాఖ్యానించారు. తాము కూడా ఇక జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు కొత్త జంట ప్రకటించింది. జీవితంలో స్థిరపడటం అంటే వారి ఉద్దేశం ఏంటో! ఇద్దరు వేర్వేరుగా పలువురితో ఇంతకాలం జరిపిన ప్రణయ పురాణాలకు స్వస్తి చెప్పడమేమో!!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు