ఆర్టికల్‌ 370; రష్యా స్పందన..ఏకాకిగా పాక్‌!

10 Aug, 2019 12:12 IST|Sakshi

మాస్కో : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుపై రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. భారత రాజ్యాంగం పరిధి మేరకే కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు...‘జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పరిస్థితి దిగజారకుండా భారత్‌-పాకిస్తాన్‌ దేశాలు సంయమనం పాటిస్తాయని మాస్కో భావిస్తోంది. గణతంత్ర దేశమైన భారత్‌... జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు విభజించడంలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించింది’ అని రష్యా ఆర్టికల్‌ 370 రద్దుపై తమ వైఖరి స్పష్టం చేసింది. కాగా జమ్మూ కశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను కట్టడి చేయాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం చర్యలకు నిరసనగా.. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పాక్‌ రద్దు చేసుకుంది. తమ దేశం నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. అదే విధంగా ఢిల్లీలోని తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని పేర్కొంది.

చదవండి :ఆర్టికల్‌ 370 రద్దు; యూఎన్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా.. జమ్మూ కశ్మీర్‌ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. దీంతో పాక్‌ దూకుడుకు కళ్లెం వేసినట్లు అయ్యింది. అదే విధంగా ఈ విషయంలో తమకు మద్దతు నిలవాల్సిందిగా కోరిన పాక్‌ అభ్యర్థనను చైనా తిరస్కరించింది. ఐక్యరాజ్యసమితి కూడా కశ్మీర్‌ విషయంలో దాయాది దేశాలు చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని గుర్తుచేసి తమ వైఖరిని స్పష్టం చేసింది. ప్రస్తుతం రష్యా కూడా భారత్‌కు అండగా నిలవడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్‌ ఏకాకిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి : కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌!

మరిన్ని వార్తలు