కశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు

11 Aug, 2019 04:34 IST|Sakshi
ఐదు రోజుల తర్వాత స్కూళ్లు తెరవడంతో జమ్మూలో స్కూల్‌ బాటపట్టిన విద్యార్థులు

మాస్కో/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నాం. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్‌ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.

నేవీలో హై అలర్ట్‌
భారత నేవీలో శనివారం హై అలర్ట్‌ ప్రకటించారు. ఎలాంటి సముద్ర దాడులనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ‘తీర ప్రాంత భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’అని నావికాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్‌ మురళీధర్‌ పవార్‌ వెల్లడించారు. ‘సముందరి జిహాద్‌’పేరుతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు సముద్రంలో దాడులు చేసేందుకు తమ కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో  అన్ని నేవీ స్టేషన్లలో హై అలర్ట్‌ విధించారు.   

లాహోర్‌–ఢిల్లీ బస్‌ సర్వీసులు నిలిపివేత
లాహోర్‌–ఢిల్లీల మధ్య నడుస్తున్న బస్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. జాతీయ భద్రతా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పోస్టు సేవల మంత్రి మురద్‌ సయీద్‌ అన్నారు. కరాచీ నుంచి వచ్చే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ 165 మంది ప్రయాణికులతో శనివారం భారత్‌ సరిహద్దుకు చేరుకుంది. అక్కడి నుంచి మరో లింకు రైలు ద్వారా ప్రయాణికులను భారత్‌ తీసుకొచ్చారు. దీనికి ముందు ఈ రైలును సరిహద్దు వరకు తీసుకురావడానికి పాక్‌ అనుమతించింది.

మరిన్ని వార్తలు