సైబర్‌ వార్‌ మొదలైందా?

17 Apr, 2018 08:59 IST|Sakshi
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

లండన్‌, ఇంగ్లండ్‌ : గ్లోబల్‌ సైబర్‌ దాడులపై అమెరికా, బ్రిటన్‌లు సోమవారం సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశాల్లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా రష్యా సైబర్‌ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి. 2015లో మొదలైన ఈ సైబర్‌ అటాక్స్‌ మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నాయి. ఈ దాడుల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించాయి.

గతేడాది ‘నాట్‌పెట్యా’  అనే సైబర్‌ దాడిలో ఉక్రెయిన్‌ కకావికలమైన విషయం తెలిసిందే. కేవలం ఉక్రెయిన్‌కే పరిమితం కానీ ఈ దాడిలో మరికొన్ని దేశాలు కూడా నష్టాలను చవి చూశాయి. ఈ దాడులను కూడా రష్యానే ప్రోత్సహించిందని అమెరికా, బ్రిటన్‌లు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యా, సిరియా ప్రభుత్వ సేనలకు వ్యతిరేకంగా సిరియాలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు దాడుల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన అనంతరం బ్రిటన్‌ దేశంలో పెద్ద ఎత్తున హ్యాకింగ్‌ జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజా దాడులు సైబర్‌వార్‌కు తెరతీస్తాయనే భయాందోళనలు బ్రిటన్‌ వ్యాప్తంగా వ్యాపించాయి. సైబర్‌ అటాక్‌ జరిగిన తర్వాత ఎవరు? ఎక్కడి నుంచి ఆ దాడి చేశారన్న విషయాన్ని గుర్తించడం అసాధ్యంగా మారింది. దీంతో అసలు దోషులు ఎవరో తెలుసుకోలేక బాధిత దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

కాగా, అమెరికా, బ్రిటన్‌ల హ్యాకింగ్‌ ఆరోపణలను రష్యా ఖండించింది. ఆయా దేశాలపై సైబర్‌ దాడికి ప్రోత్సహించామని అనడంలో వాస్తవం లేదని పేర్కొంది. కాగా, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడం వెనుక రష్యా హస్తముందని అమెరికా ఇంటిలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు