అమెరికా ఆయుధ వ్యవస్థ అంత బలహీనమా?

20 Sep, 2019 15:02 IST|Sakshi

మాస్కో : సౌదీ చమురు క్షేత్రాలపై యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు డ్రోన్‌ల ద్వారా దాడులు చేయడం తెలిసిందే. ఈ ఘటనతో పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులకు ఇరాన్‌ కారణమంటూ ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని అమెరికా హెచ్చరికలు చేస్తోంది. సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తప్పవని హెచ్చరించింది. తమను వేలెత్తి చూపితే యుద్ధానికి కూడా వెనకాడబోమని, ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలను, నౌకలను నాశనం చేస్తామని ఇరాన్‌ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అయితే ఇక్కడ అమెరికా ఆయుధ సామర్థ్యంపై రక్షణ నిపుణులు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికి అందనంత దూరంలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నది అమెరికాకు మాత్రమే అని తరచూ ఆ దేశం జబ్బలు చరుచుకుంటుంది. తన మిత్ర దేశాలకు ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అమెరికా ఆయుధాల ప్రధాన దిగుమతిదారులలో సౌదీ అరేబియా కూడా ఒకటి. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ అంతర్జాతీయ అంశాలలో, ముఖ్యంగా ఇరాన్‌ విషయంలో ఈ రెండు దేశాలు ఒకే మాట మీద ఉంటున్నాయి.  అందుకే సౌదీపై ఉగ్రదాడులు జరిగిన మరుక్షణమే అమెరికా స్పందించింది. బాధ్యత వహించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇరాన్‌ను నిందించారు కూడా. ఈ ఘటనపై ఎలా ముందుకెళ్లాలంటూ అమెరికా, సౌదీలు ప్రస్తుతం తీవ్ర చర్చలే జరుపుతున్నాయి.


సౌదీ అరేబియా మోహరించిన గగనతల రక్షణ స్థావరాలు

యుద్ధం వస్తే.. సౌదీ గగనతలం పటిష్టమేనా?
అమెరికా, సౌదీలు ఏమాత్రం తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా యుద్ధం తప్పదు. ఇవి రెండూ మూకుమ్మడిగా ఇరాన్‌పై దాడి చేస్తే ఇరాన్‌ తొలుత సౌదీనే లక్ష్యంగా చేసుకుంటుంది. మరి సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టమో గతవారం దాడులతో తెలిసిపోయింది. సౌదీ అరేబియా తమ దేశం సరిహద్దుల గుండా అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ పేట్రియాట్‌ను మోహరించింది. అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థగా చెప్పుకునే ఈ వ్యవస్థలో బహుళ పేట్రియాట్ లాంచర్లు, ఏజిస్ విధ్వంసకారులు, రాడార్లు సౌదీ గగనతలాన్ని కాపలాకాస్తున్నాయి. రక్షణ వ్యవస్థలో భాగంగా సౌదీ తమ దేశం చుట్టూ 88 పేట్రియాట్‌ లాంచర్లు మోహరించింది. వీటిలో అత్యాధునీకరించిన పాక్‌-3 తరగతికి చెందిన పేట్రియాట్‌ క్షిపణులు 52 ఉన్నాయి. 100 ఎస్‌ఎమ్‌-2 మిసైల్స్‌ను తీవ్ర ఉద్రిక్తతలు గల పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఉంచింది. ఈ రక్షణ వ్యవస్థతో సౌదీ గగనతలంలోకి వచ్చే శత్రుదేశానికి చెందిన ఎలాంటి క్షిపణులు, యుద్ధ విమానాలైనా ధ్వంసం కాగలవని సౌదీ విశ్వాసం.


అమెరికా పేట్రియాట్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ 

అయితే, గగనతల రక్షణ వ్యవస్థ వీరు చెప్పుకుంటున్నట్లు అంత పటిష్టమేనా అనే సందేహం రాకమానదు. ఎందుకంటే ఒక చిన్న దేశానికి చెందిన ఉగ్రవాదులు ఆయుధాలు కల్గిన డ్రోన్లతో పూర్తి రాడార్ కవరేజీ గల సౌదీ ప్రఖ్యాత చమురు సంస్థ ఆరామ్‌కో క్షేత్రాలపై దాడులు చేస్తేనే గుర్తించలేకపోయారు. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ సంఘటనే స్పష్టం చేస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగా యుద్ధం వచ్చి ఇరాన్‌ యుద్ధ విమానాలు సౌదీని చుట్టుముడితే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తకమానదని యుద్ధరంగ నిపుణులు అంటున్నారు.

రష్యన్‌ ఎస్‌-400
రష్యా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400ను అన్ని ప్రధాన దేశాలు కొనాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. వాటిని కొంటే ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. తమ గగనతల రక్షణ వ్యవస్థ పేట్రియాట్‌ ఎస్‌-400కన్నా మెరుగైందని, అలాగే తమ యుద్ధ విమానాలు కొనాలని సూచిస్తోంది. అయినా అమెరికా నాటో మిత్రదేశం టర్కీ రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసింది. ఈ చర్యతో అంతర్జాతీయంగా అమెరికా భంగపడ్దా టర్కీని ఏమనలేక మిన్నకుండింది.


రష్యా ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ

ఇప్పుడు డ్రోన్‌ దాడులతో సౌదీలో అమెరికా తయారీ గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యం ఏపాటిదో తెలిసిపోయింది. అంటే అమెరికా రక్షణ వ్యవస్థనే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. కొన్నిసార్లు అత్యంత ఉన్నతమైనవి కూడా విఫలం అవుతుంటాయని, అయినా దాడి సమయంలో ఒక్క పేట్రియాట్‌ మాత్రమే సేవలు అందిస్తోందని తమ బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. రష్యా సైనిక అధికారి మాక్సిమ్‌ సుఖోవ్‌ ఇదే విషయమై ట్వీట్‌ చేశారు. ‘విఫలమైన రక్షణ వ్యవస్థను అన్ని కోట్ల డాలర్లు పెట్టి కొనడం ఎందుకని’ సౌదీ అరేబియాను ప్రశ్నించారు.

చదవండి : అమెరికా, రష్యా మధ్య అణు యుద్ధం జరిగితే....

>
మరిన్ని వార్తలు