'డీజిల్‌' లేని లోటు తీరుస్తున్న పప్పీ!

8 Dec, 2015 15:37 IST|Sakshi
'డీజిల్‌' లేని లోటు తీరుస్తున్న పప్పీ!

మాస్కో:  అది 'డీజిల్‌' కాకపోవచ్చు. కానీ 'డీజిల్‌' లేని లోటును కొంత తీర్చేందుకు ఫ్రాన్స్ వాసుల ఒడికి చేరింది. అదే 'పప్పీ'.. రష్యా ఈ మేలుజాతి శునకాన్ని ఫ్రాన్స్ కు కానుకగా ఇచ్చింది.  గత నెల పారిస్‌లోని సెయింట్ డెనిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 'డీజిల్‌' అనే పోలీసు కుక్క ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఆ శునకం స్మృతులు పారిస్ వాసులను వెంటాడుతున్న నేపథ్యంలో రష్యా వారికి 'డొబ్రిన్య' పేరిట పప్పీడాగ్‌ను బహుమానంగా ఇచ్చింది. 'మీరు ఈ రోజు అందిస్తున్న ఈ పప్పీ.. డీజిల్‌ స్థానాన్ని భర్తీ చేయనుంది. అదేవిధంగా ఇది మన స్నేహాన్ని చాటుతుంది' అని ఫ్రాన్స్ రాయబారి జీన్ మౌరిస్ రిపర్ట్‌ తెలిపారు. మాస్కోలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో జరిగిన పప్పీ బహుమాన కార్యక్రమంలో రిపర్ట్ మాట్లాడుతూ ఫ్రాన్స్ వాసులు 'పప్పీ' కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

పారిస్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి 130 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకు పారిస్ శివార్లలో ఉన్న సెయింట్ డెనిస్‌లో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య భారీ షుటౌట్‌ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 'డీజిల్‌' ప్రాణాలు విడువడం ఫ్రాన్స్ వాసులను కలిచివేసింది. 'నేను శునకం' (జె స్యూస్ చీన్) హాష్‌ట్యాగ్‌తో 'డీజిల్‌'కు పెద్ద ఎత్తున వారు నివాళులర్పించారు. ఫ్రెంచ్ వ్యంగ్య దినపత్రిక చార్లీ హెబ్డోపై దాడి జరిగినప్పుడు కూడా ఇదే విధంగా 'నేను చార్లీ' హాష్‌ట్యాగ్‌తో ఫ్రాన్స్ ప్రజలు భారీ ఎత్తున సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'పప్పీ' బహుమానం ఇరుదేశాల ఐక్యతకు, ఉగ్రవాదంపై తమ రాజీలేని పోరాటానికి నిదర్శనమని రష్యా డిప్యూటీ ఇంటీరియర్ మినిష్టర్ ఇగోర్ జుబావ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు