‘మిగ్‌–35’పై భారత్‌ ఆసక్తి

25 Jul, 2017 09:59 IST|Sakshi
‘మిగ్‌–35’పై భారత్‌ ఆసక్తి

యుద్ధ విమానాల అమ్మకంపై భారత్‌తో రష్యా చర్చలు
రుగోస్కీ(రష్యా): భారత్‌కు మిగ్‌–35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది. మిగ్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఇల్యా టారసెంకో మాట్లాడుతూ.. ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్‌ కూడా ఆసక్తిగా ఉందని ఆయన చెప్పారు. అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్స్‌ ఐదో తరం యుద్ధ విమానాలు ఎఫ్‌–35 కంటే మిగ్‌–35 అత్యుత్తమమని ఆయన పేర్కొన్నారు. అమెరికన్‌ జెట్‌లను గగనతల పోరులో తమ విమానాలు ఓడించగలవని చెప్పారు. రుగోస్కీ నగరంలో ‘మాక్స్‌ 2017’ ఎయిర్‌షో సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మిగ్‌–35 యుద్ధ విమానాలపై భారత్, ఇతర ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నామని ఆయన తెలిపారు. భారత్‌కు యుద్ధ విమానాల సరఫరాకు టెండర్లు దాఖలు చేస్తున్నామని.. బిడ్‌ దక్కించుకునేందుకు భారత ఎయిర్‌ఫోర్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని టారసెంకో పేర్కొన్నారు. మిగ్‌–35పై భారత్‌ ఆసక్తిగా ఉందా అని ప్రశ్నించగా.. అవునని చెప్పారు. రష్యా రూపొందించిన అత్యాధునిక 4++ జనరేషన్‌ యుద్ధ విమానాలే మిగ్‌ 35.. దాదాపు 50 ఏళ్లుగా భారత్‌ రష్యాకు చెందిన మిగ్‌ విమానాల్ని వినియోగిస్తోంది. మిగ్‌–29 బేసిక్‌ ఫైటర్‌ జెట్‌తో పోలిస్తే.. మిగ్‌–35లు ఎంతో అత్యాధునికం.  మరోవైపు సైనిక అవసరాలకు వాడే ఎంఐ–171ఈ హెలికాప్టర్‌ను పాకిస్తాన్‌కు రష్యా అందచేసింది. ఈ హెలికాప్టర్లను పాక్‌కు అందచేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. 

మిగ్‌ –35 ప్రత్యేకతలు
ఒకరు లేదా ఇద్దరు పైలట్లు నడపొచ్చు. టేకాఫ్‌ సమయంలో గరిష్ట బరువు 29,700 కిలోలు
♦  ఎత్తులో ఉన్నప్పుడు గరిష్ట వేగం గంటకు 2,400 కి.మీ.
♦  సముద్రమట్టంలో గంటకు  వేగం 1450 కి.మీ.
♦  1000 కి.మీ. పరిధిలో యుద్ధ విన్యాసాలు చేయగలదు.
♦  గన్స్‌: జీఎస్‌హెచ్‌–301 ఆటోకేనన్‌ (150 రౌండ్స్‌)
♦   రాకెట్‌లు : ఐదు
క్షిపణులు: గగనతలం నుంచి గగనతలం(రెండు), గగనతలం నుంచి భూఉపరితలంపైకి(ఒకటి), యాంటీ రేడియేషన్‌ మిస్సైల్, యాంటీ షిఫ్‌ మిస్సైల్‌
♦  బాంబులు: కేఎబీ–500కేఆర్, కేఏబీ–500ఎల్, కేఏబీ–500ఎస్‌

మరిన్ని వార్తలు