గంటకు 24,696 కి.మీ. దూసుకెళ్లే క్షిపణి

27 Dec, 2018 04:19 IST|Sakshi

రష్యా అమ్ములపొదిలో ‘అవన్‌గార్డ్‌’

మాస్కో: రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థ అవన్‌గార్డ్‌ తుది పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘నా ఆదేశాల మేరకు రక్షణశాఖ అణ్వస్త్ర సామర్థ్యమున్న అవన్‌గార్డ్‌ క్షిపణికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం విజయవంతంగా నిర్వహించింది.

ప్రస్తుతం రష్యా వద్ద సరికొత్త వ్యూహాత్మక ఆయుధముంది’ అని ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వెల్లడించారు.ఈ క్షిపణిని 2019 నుంచి రష్యా సైన్యం వినియోగించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచదేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏమార్చగల అవన్‌గార్డ్‌ క్షిపణి గంటకు 24,696 కి.మీ (20 మ్యాక్‌) వేగంతో దూసుకుపోగలదు. ఇందులో అమర్చిన గ్లైడర్ల కారణంగా క్షిపణి నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా ఈ రాకెట్‌ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నయినా 30 నిమిషాల్లో తుత్తునియలు చేయగలదు.

మరిన్ని వార్తలు