విమానానికి అతి సమీపంగా దూసుకొచ్చిన జెట్

30 Jan, 2016 15:28 IST|Sakshi
విమానానికి అతి సమీపంగా దూసుకొచ్చిన జెట్

యూఎస్ ఎయిర్ ఫోర్స్ గూఢచర్య విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నెల 25న నల్లసముద్రంపై గగనతలంలో నియమిత మార్గంలో యూఎస్ ఆర్సీ-135యూ విమానం వెళ్తుండగా, రష్యా యుద్ధ విమానం దాన్ని వెంబడించేందుకు అతి సమీపంగా దూసుకువచ్చినట్టు పెంటగాన్ అధికారులు వెల్లడించారు. ఓ సమయంలో రెండింటి మధ్య దూరం కేవలం 15 అడుగులే. ఈ ఘటనను అపాయకరమైన చర్యగా పెంటగాన్ ప్రకటించింది. ప్రత్యేకించి ఈ ఘటనపై దృష్టి సారిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మిచెల్లీ ఎల్ బల్డాంజా చెప్పారు.

రష్యా తీరానికి 4౦ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు మరో యూఎస్ మిలటరీ అధికారి తెలిపారు. యూఎస్ విమానానికి కుడివైపునకు సమీపంలో రష్యా జెట్ దూసుకురాగా, పైలట్ వెంటనే విమానాన్ని దూరంగా మళ్లించాడని, ఈ చర్య విమాన నియంత్రణపై ప్రతికూలత చూపిందని చెప్పారు. విమానంలో 21 మంది సిబ్బంది ఉన్నారు. విదేశీ మిలటరీ స్థావరాలను గుర్తించేందుకు ఆర్సీ-135 యూ విమానాన్ని ఉపయోగిస్తుంటారని యూఎస్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. దీనికి నాలుగు ఇంజిన్లు ఉంటాయి.

2014లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఆర్సీ-135యూ విమానానికి 100 అడుగుల సమీపంలో రష్యా జెట్ ప్రయాణించింది. రష్యా, జపాన్ దేశాల మధ్య గల సముద్ర గగనతలంలో ఈ ఘటన జరిగిందని యూఎస్ మిలటరీ అధికారి చెప్పారు. గగనతలంలో రష్యా జెట్లు వెంబడించడం సాధారణ విషయమే అయినా చాలా వరకు సురక్షితంగా నిర్వహించేవారని చెప్పారు. ఈ రెండు ఘటనలు ప్రమాదకరమైనవని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు