పుతిన్‌.. ఎన్నటికీ రష్యాధిపతే!

17 Jan, 2020 03:47 IST|Sakshi
మాస్కోలో కలసివస్తున్న పుతిన్, మెద్వదేవ్‌

రాజ్యాంగ సవరణలకు అధ్యక్షుడి ప్రతిపాదన

2024 తరవాత కూడా పట్టు కొనసాగేలా యత్నాలు

దానికి అనుగుణంగా ప్రధాని మెద్వదేవ్‌ రాజీనామా

మాస్కో: రష్యాలో రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న తన అధికారాన్ని ఇకపైనా నిరాటంకంగా కొనసాగించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పలు రాజ్యాంగ సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. పార్లమెంటు, కేబినెట్‌ అధికారాలను విస్తృతపరచాల్సి ఉందని బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఈ మేరకు సవరించాల్సి ఉందన్నారు. 2024తో దేశాధ్యక్షుడిగా పుతిన్‌ పదవీకాలం ముగియనుండటంతో... ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

పార్లమెంటు పాత్ర పెరగాలి: ప్రధానమంత్రిని, కేబినెట్‌ను ఎంపిక చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలని పుతిన్‌ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంది. ‘ఆ అధికారాలను ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంట్‌ పాత్ర మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి, కేబినెట్‌ మంత్రుల అధికారం, స్వతంత్రత కూడా పెరుగుతాయి’ అని ఆ ప్రసంగంలో పుతిన్‌ స్పష్టంచేశారు. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక పెట్టారాయన. ‘‘అలాగని పార్లమెంటరీ పాలన విధానం గొప్పదని చెప్పలేం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్తే దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగే అవకాశముంది.  ‘ప్రధానిని, కేబినెట్‌ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికే ఉండాలి.

రక్షణ రంగంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం సైతం దేశ అధ్యక్షుడికే ఉండాలి. రష్యా మిలటరీ, ఇతర దర్యాప్తు సంస్థల ఇన్‌చార్జిగా కూడా అధ్యక్షుడే ఉండాలి’ అని పుతిన్‌ స్పష్టం చేశారు. ప్రాంతీయ గవర్నర్లు సభ్యులుగా ఉన్న స్టేట్‌ కౌన్సిల్‌ అధికారాలను కూడా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనాలని సూచించారాయన. ‘ఎక్కువమంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలి. తక్కువ ఆదాయం వల్లే జనం ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి ఆదాయాన్ని పెంచేలా పరిశ్రమలు తేవాలి’ అని చెప్పారాయన.  రష్యా ప్రస్తుత జనాభా 14.7 కోట్లు.  ప్రతిపాదిత సంస్కరణలను దేశవ్యాప్త ఓటింగ్‌కు పెట్టాలని పుతిన్‌ కోరారు.

మెద్వదేవ్‌ రాజీనామా
పుతిన్‌ ప్రసంగం అనంతరం, దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పుతిన్‌ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్‌ రాజీనామాను పుతిన్‌ ఆమోదించారు. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్‌ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్‌ ఆమోదించింది. కాగా, మెద్వదేవ్‌ పనితీరుపై గతంలో పుతిన్‌ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

పుతిన్‌ ఆలోచన ఇదే!!
రష్యా రాజ్యాంగం వరసగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి  అవకాశం కల్పిస్తోంది. 2000వ సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్‌...  నిబంధనల ప్రకారం నాలుగేళ్లు చొప్పున 2008 వరకూ రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరవాత  ప్రధాని పదవిని చేపట్టారు.  ప్రధానిగా ఉన్న తన అనుచరుడు మెద్వదేవ్‌ను అధ్యక్షుడిని చేశారు. తన పదవీకాలంలో మెద్వదేవ్‌... అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచేశారు. అంతేకాకుండా 2012లో పుతిన్‌ కోసం మెద్వదేవ్‌ తన పదవి నుంచి దిగిపోయారు.

అప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్‌ 2018లో మొదటి విడతను పూర్తి చేసుకుని, రెండోవిడత కూడా కొనసాగుతున్నారు. 2024 వరకూ పదవీ కాలం ఉంది.  గ్యాప్‌ కోసం 2024లో మళ్లీ దిగి... ప్రధానిగా బాధ్యతలు చేపడతారని, అప్పుడు కూడా తన చేతిలో అధికారమంతా ఉండేందుకే పుతిన్‌ ఈ ప్రతిపాదన చేశారని విశ్లేషకుల మాట. తన స్థానంలో అధ్యక్షుడిగా వచ్చే వ్యక్తి .. మళ్లీ తనకే పగ్గాలు అప్పగించేలా చేయడమే పుతిన్‌ వ్యూహమని చెబుతున్నారు. జోసెఫ్‌ స్టాలిన్‌ తరువాత అత్యధిక కాలం దేశ కీలక పదవిలో కొనసాగిన ఘనత పుతిన్‌దే కావడం విశేషం.  

రష్యా కొత్త ప్రధాని మైఖేల్‌ మిషుస్తిన్‌
 

మరిన్ని వార్తలు