నెత్తి మీద పిడుగు..!

30 Apr, 2015 02:05 IST|Sakshi
నెత్తి మీద పిడుగు..!

భూమి వైపు దూసుకొస్తున్న రష్యా వ్యోమనౌక
మాస్కో: భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సరుకులు మోసుకెళ్లిన రష్యా మానవ రహిత వ్యోమనౌక ‘ప్రోగ్రెస్ ఎం-27ఎం’ దారి తప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపే దూసుకొస్తోంది!  సోయుజ్ రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను రష్యా మంగళవారం ప్రయోగించింది. అయితే, నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరడంతో పాటు వ్యోమనౌక భూమితో సంబంధాలు కోల్పోయింది.


దీంతో భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా కిందికి దిగుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అయితే, ప్రోగ్రెస్ వ్యోమనౌక బుధవారం 197 కి.మీ. ఎత్తులో తిరుగుతోందని, మే 5-7 తేదీల మధ్య వాతావరణంలోకి ప్రవేశించి అది మండిపోతుందని  శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యోమనౌక శకలాల్లో చాలావరకూ మండిపోతాయని, కానీ మిగిలిపోయే కొన్ని శకలాలు ఎక్కడ పడతాయో మాత్రం తెలియదన్నారు.

మరిన్ని వార్తలు