లండన్‌ వీధుల్లో రష్యన్ల అనూహ్య మరణాలు.. పుతిన్‌ బాధ్యుడా?

27 Mar, 2018 20:38 IST|Sakshi
రష్యా మాజీ గూఢచారి లిత్వినెంకో(ఫైల్‌ ఫొటో), రష్యా ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌

హైదరాబాద్‌ : రష్యా మాజీ గూఢచారి సెర్జీ స్క్రీపాల్ హత్యకు రసాయన ఆయుధంతో చేసిన ప్రయత్నానికి నిరసనగా అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల్లో గూఢచారులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై 100మందికి పైగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు. ఈ నెల 4న దక్షిణ ఇంగ్లండ్లోని శాలిస్బరీలో  స్క్రీపాల్(66), ఆయన కూతురు యూలియా(33)ను ‘నోవిచోక్’ అనే విషపదార్థంతో చంపడానికి రష్యన్లు ప్రయత్నించగా వారిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నరాలపై పని చేసే కొన్ని విష పదార్థాల్లో ఒకటైన నోవిచోక్‌ వంటి రసాయనాలను రష్యా తన శత్రువులను, అసమ్మతి వాదులను తుద ముట్టించడానికి వినియోస్తోందని చాలాకాలంగా పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.

సైనిక గూఢచర్యం నుంచి శత్రు శిబిరంలో చేరిన స్క్రీపాల్
రష్యా సైనిక గూఢచర్య సంస్థ జీఆర్‌యూలో ఉన్నతాధిగారిగా చేరిన స్క్రీపాల్‌ తన విధుల్లో భాగంగా ఐరోపా దేశాలైన మాల్టా, స్పెయిన్‌లలో పని చేశారు. అనారోగ్యం కారణంగా 1996లో అక్కడి నుంచి మాస్కోలోని జీఆర్‌యూ ఆఫీసులో చేరారు. 1999లో ఆరోగ్యం క్షీణించిందనే సాకుతో జీఆర్‌యూ నుంచి రిటైరయ్యారు. అయితే, 1995 నుంచి స్క్రీపాల్ బ్రిటిష్‌ గూఢచార సంస్థ ఎస్ఐఎస్(ఎం16)తో సంబంధాలు పెట్టుకుని ఐరోపా దేశాల్లో పనిచేస్తున్న 300 మందికి పైగా రష్యన్‌ గూఢచారుల వివరాలను ఈ సంస్థకు వెల్లడించారని రష్యా సర్కారు ఆరోపించింది.

2004 డిసెంబర్లో అప్పుడే బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన ఆయనను మాస్కోలోని ఆయన ఇంటి ముందే రష్యా అధికారులు అరెస్ట్‌ చేశారు. దేశ ద్రోహ నేరంపై ఆయన్ను సైనిక కోర్టులో విచారించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా, 2006 నవంబర్లో ఈ శిక్షను సైనిక సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అమెరికాలో అరెస్ట్‌ అయిన పది మంది రష్యన్‌ గూఢచారుల విడుదలకు బదులుగా మరో ముగ్గురు రష్యన్లతో పాటు స్క్రీపాల్‌ను 2010 జులై 9న విడుదల చేశారు.

అప్పటి రష్యా అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్‌ క్షమాభిక్షతో జైలు నుంచి విడుదలైన ఆయన బ్రిటన్‌ చేరుకుని 2011లో శాలిస్బరీలో ఇల్లు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. ఇటీవల మాస్కో నుంచి వచ్చిన కూతురు యూలియాతో కలిసి శాలిస్బరీ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని ప్రదేశంలో బెంచీపై కూర్చుని ఉండగా హఠాత్తుగా వారు కుప్పకూలిపోయారు.

విష ప్రయోగంతో మృతి చెందిన లిత్వినెంకో
రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్‌బీ మాజీ అధికారి అలెగ్జాండర్‌ లిత్వినెంకో 2006 నవంబర్లో విష ప్రయోగం వల్ల మరణించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పుతిన్ ఆదేశాలతో దేశ బహిష్కరణకు గురైన రష్యన్‌ మాజీ బ్యాంకర్‌ జర్మన్‌ గోర్బున్‌త్సోవ్ 2012లో తూర్పు లండన్‌లో క్యాబ్‌లో వెళుతుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. గోర్బున్‌త్సోవ్‌ ఈ ఘటనలో బతికి బయటపడ్డారు. 2012 నవంబర్లో లండన్‌లో తాను నివసించే గేటెడ్‌ కమ్యూనిటీ కాంపౌండ్లో రష్యన్‌ వ్యాపారి అలెగ్జాండర్‌ పెరెపిల్చినీ కుప్పకూలి మరణించారు.

ఓ అమెరికన్‌ వ్యాపారి నియంత్రణలోని హెర్మిటేజ్ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ను రష్యా అధికారులు ఎలా మోసగించారో స్విస్ అధికారులకు పెరెపిల్చినీ సమాచారం అందించారు. ఆయన తిన్న ఓ రష్యా వంటకంలో జెల్సెమియం అనే విషపూరిత పువ్వు నుంచి తీసిన అవశేషాలు ఉన్నాయని శవ పరీక్షలో తేలింది. పుతిన్‌ మాజీ గురువుగా పరిగణించే బిలియనీర్‌ బోరిస్‌ బెరెజోవ్‌స్కీ కూడా దేశ బహిష్కరణ తర్వాత లండన్‌లో స్థిరపడి పుతిన్‌పై పదేళ్లకు పైగా మీడియా ద్వారా పోరాటం జరిపారు. 2013 మార్చిలో ఆయన తన లండన్ అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించినట్టు కనుగొన్నారు. ఆయనది హత్యేనని శవపరీక్షలో తేలింది.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)

మరిన్ని వార్తలు