176 మంది మృతి: బాలుడి భావోద్వేగం

20 Jan, 2020 16:35 IST|Sakshi

ఒట్టావా: ఇరాన్‌- అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉక్రెయిన్‌ విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన 13 ఏళ్ల ర్యాన్ పౌర్జామ్.. తన తండ్రి గొప్పతనాన్నిగుర్తు చేసుకున్నాడు. తన తండ్రి మన్సూర్ పౌర్జామ్‌ ఓ బలమైన, సానుకూలమైన భావజలం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. గత బుధవారం కెనడా రాజధాని ఒట్టావా నగరంలోని కార్లెటన్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన్సూర్‌ పౌర్జామ్ స్మారక సమావేశంలో ర్యాన్‌ పౌర్జామ్‌ ప్రసంగించాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇప్పటివరకు మా తండ్రి మన్సూర్‌  పౌర్జామ్ చేసే పనిలోగాని.. చేతలు, మాటల్లోగాని ఎటువంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నట్లు నేను చూడలేదు. నేను చెడు విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే నా తండ్రి సజీవంగా ఇక్కడే ఉన్నారని తెలుసు. అదేవిధంగా మా నాన్న చెడు విషయాలు గురించి మాట్లాడరు. నేను కూడా అంతే. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ర్యాన్‌  పౌర్జామ్ చాలా భావోద్వేగంతో తన ప్రసంగాన్ని ముగించాడు.(క్షమించరాని తప్పు చేశాం: ఇరాన్‌)

కాగా ర్యాన్‌పౌర్జామ్ ప్రసంగపు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ట్విటర్‌లో చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువకుడి మానసిక పరిపక్వతను ప్రశంసిస్తున్నారు. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఇరాన్‌ సైన్యం... ఉక్రెయిన్‌ విమానాన్ని కూల్చిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ విషయాన్ని అంగీకరించని ఇరాన్‌... ఎట్టకేలకు తామే దుర్ఘటనకు కారణమని ఒప్పుకొన్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన 176 మందిలో ర్యాన్ పౌర్జామ్ తండ్రి మన్సూర్‌ పౌర్జామ్ కూడా ఒకరు. కాగా ఇందులోఇరాన్‌ సంతతికి చెందిన వారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు