ట్రూడోతో పేచీ దేనికి?

21 Feb, 2018 20:28 IST|Sakshi

శనివారం నుంచి దేశంలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెంట భారత మంత్రులు ఎవరూ తిరగడం లేదు. ఆగ్రా తాజ్‌మహల్‌. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం, గుజరాత్‌ సబర్మతీ ఆశ్రమం సందర్శించినప్పుడు ట్రూడోతోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలే కనిపించారు. భారతీయ దుస్తుల్లో ఉన్న ట్రూడో ఫ్యామిలీ ఫోటోలే పత్రికల్లో దర్శనమిస్తున్నాయి. కిందటివారం దిల్లీ విమానాశ్రయంలో దిగిన ట్రూడోకు స్వాగతం పలికిన భారత అధికారుల్లో ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌ సభ్యులెవరూ లేరు. (సాక్షి ప్రత్యేకం)

కెనడాతో(జనాభా మూడున్నర కోట్లు) పోల్చితే  చిన్న దేశం ఇజ్రాయెల్‌(84 లక్షలు) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఇటీవల ఇండియా వచ్చినప్పుడు రాజధాని ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మోదీ ఆలింగనంతో స్వాగతం పలికారు. అదీగాక కెనడాతో వందేళ్లకు పైగా భారత్‌కు సంబంధాలున్నాయి. అక్కడ భారత సంతతికి చెందిన జనాభా నాలుగు శాతం(దాదాపు 14 లక్షలు) ఉన్నారు. ఇండియా మాదిరిగానే కెనడా ప్రజాస్వామ్యి దేశం. (సాక్షి ప్రత్యేకం) ఈ నేపథ్యంలో వారం రోజుల అధికార పర్యటనపై వచ్చిన ట్రూడోతో భారత సర్కారు అంటీముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది? అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకడం లేదు. కెనడాలో దాదాపు 1.4 శాతం జనాభా, పార్లమెంటులో 17 మంది సభ్యుల ప్రాతినిధ్యమున్న సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, పరోక్షంగా మద్దతిస్తోందని మోదీ సర్కారు, ముఖ్యంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం భావించడమే ట్రూడోకు ఘనస్వాగతం లభించకపోవడానికి కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సిక్కుల కార్యక్రమంలో ట్రూడో
కిందటేడాది ట్రూడో పాల్గొన్న టోరంటో సిక్కుల కార్యక్రమంలో 1984 అమృత్‌సర్‌ సైనిక చర్యలో మరణించిన సంత్‌ జర్నాయిల్‌సింగ్‌ భింద్రన్‌వాలే ఫోటోలున్న పోస్టర్లు ప్రదర్శించారు. పంజాబ్‌ ఖలిస్తాన్‌ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొద్దిమంది మద్దతు ఇచ్చిన మాట నిజమే. 1985లో టోరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు దారిలోనే బాంబుపేలుడుతో కూల్చేశారు. ఈ కేసులో శిక్షపడిన ఒకే ఒక సిక్కు తీవ్రవాది రెండు దశాబ్దాలు జైలు జీవితం గడిపాడు. (సాక్షి ప్రత్యేకం) కెనడా కోర్టు ఆదేశంపై కింటేడాది ఆయనను విడుదల చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలో మూడు వేల మంది సిక్కులను వేటాడి చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’ అని వర్ణించడం అప్పటి కేంద్ర సర్కార్లకు నచ్చలేదు. ఇప్పటికీ కెనడా సిక్కుల్లో కొద్ది మంది ఖలిస్తాన్‌ ప్రస్తావన తేవడం ఇండియాకు మింగుడుపడడం లేదు. కిందటేడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆమ్‌) తరఫున కెనడా నుంచి వచ్చిన సిక్కులు ప్రచారం చేయడమేగాక ఆ పార్టీకి నిధులు సమకూర్చారంటూ పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ ఆరోపించారు. ట్రూడో మంత్రివర్గంలో కేబినెట్‌ (రక్షణ శాఖ) మంత్రి హర్జీత్‌సింగ్‌ సజ్జన్‌ ఖలిస్తానీ సానుభూతిపరుడంటూ కిందటేడాది ఆయనను కలుసుకోవడానికి అమరీందర్‌ నిరాకరించారు. (సాక్షి ప్రత్యేకం)

ఖలీస్తానీలే అసలు సమస్యా?
ఇంథన భద్రత నుంచి విద్యారంగం వరకూ కెనడా, ఇండియా మధ్య పలు రంగాల్లో 600 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని 2016 అంచనాలు చెబుతున్నాయి. కెనడా యూనివర్పిటీల్లో చదువుకునే, అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. (సాక్షి ప్రత్యేకం) అమెరికాలో మాదిరిగాకాక కెనడాలో భారతీయులకు శాశ్వత నివాస సౌకర్యం(పీఆర్‌) తేలికగా లభిస్తోంది. ఇలా అనేక రకాలుగా దశాబ్దాలపాటు సత్సంబంధాలు కొనసాగుతున్న రెండు ప్రజాతంత్ర దేశాల మధ్య ప్రస్తుత ‘పేచీ’కి ఖలిస్తాన్‌ సమస్య ఒక్కటే అసలు కారణం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ట్రూడో, మోదీ మధ్య సన్నిహిత రాజకీయబంధం లేకపోవడమే ప్రస్తుత వివాదానికి మరో కారణమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ‘‘ ట్రూడో పర్యటనను మోదీ చూసీచూడనట్టు వ్యవహరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాద సమస్యపై కెనడా సర్కారు వైఖరిపై తమకు తీవ్ర అసంతృప్తిగా ఉందని భారత్‌ ఇలా బలమైన సంకేతం పంపించినట్టు కనిపిస్తోంది.’’ అని బ్రూకింగ్స్‌ ఇండియాలో నిపుణుడు ధ్రువ జైశంకర్‌ అన్నారు. (సాక్షి ప్రత్యేకం)

-- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు