రాత్రి ఉగ్రవాదం.. పొద్దున క్రికెట్‌ ఇక కుదరదు!

26 Sep, 2019 09:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌ భారత్‌కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని విడనాడేవరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మరోసారి స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో గురువారం జీ4 (భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ  సందర్భంగా జరిగిన విదేశంగ మంత్రుల కౌన్సిల్‌ సదస్సులో జైశంకర్‌ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉంది.  కానీ బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఒక దేశం పొరుగు దేశానికి వ్యతిరేకంగా పెద్దస్థాయిలో ఉగ్రవాద పరిశ్రమను తెరువడం ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు. పాకిస్థాన్‌తో చర్చలు జరపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, టెర్రరిస్తాన్‌తో మళ్లీ చర్చలు జరపాలనుకోవడమే సమస్య. పొరుగు దేశంతో చర్చించాలని ప్రతి దేశం కోరుకుంటుంది. కానీ ఉగ్రవాదం ఒక విధానంగా ఉన్న దేశంతో చర్చలు ఎలా జరపాలి?’అని పేర్కొన్నారు. 

భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ.. క్రికెట్‌, ఉగ్రవాదం కలిసి సాగబోదని, ఉదయం క్రికెట్‌ ఆడి.. రాత్రి ఉగ్రవాద దాడులు చేస్తామంటే ఎంతమాత్రం కుదరబోదని జైశంకర్‌ తేల్చిచెప్పారు. ‘భారత్‌ ప్రజాస్వామిక దేశం. ఉగ్రవాదం, క్రికెట్‌ కలిసి సాగడాన్ని ప్రజలు  ఎంతమాత్రం ఆమోదించబోరు. ఉగ్ర దాడుల తెల్లారి టీ బ్రేక్‌ తీసుకొని.. ఆ మరునాడు క్రికెట్‌ ఆడలేము’ అని ఆయన అన్నారు. రాత్రి ఉగ్రవాదం, పొద్దున్న క్రికెట్‌ అన్న విధానం ఇక నడవబోదని స్పష్టం చేశారు. 
 

మరిన్ని వార్తలు