జూనోసిస్‌ డే...

5 Jul, 2020 02:56 IST|Sakshi

ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఇది అవసరమని భావిస్తోంది. నిజం కూడా ఇదే. అయితే.. మొట్టమొదటి వ్యాక్సిన్‌ ఏదో?, ఎవరు తయారు చేశారో? తెలుసా? కచ్చితంగా 135 ఏళ్ల క్రితం, జూలై 6న తొలి వ్యాక్సిన్‌ ప్రయోగం జరిగింది! అందుకే ఏటా ఆ రోజును ‘వరల్డ్‌ జూనోసిస్‌ డే’గా జరుపుకుంటున్నారు. జూనోసిస్‌ అంటే ఏమిటని సందేహమా? చదివేయండి మరి!..

జూనోసిస్‌ డే...
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్‌ అంటారు. గబ్బిలాలు లేదా పాంగోలిన్‌ల నుంచి కరోనా సోకినట్టన్న మాట. ఇలాంటి జంతు సంబంధ వ్యాధులు సుమారు 150 వరకు ఉన్నాయని అంచనా. అంతేకాదు.. జంతు సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల పాలయ్యేవారు ఏటా కోట్లాది మంది ఉంటే 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తామర వంటి సాధారణ వ్యాధి మొదలు ప్లేగు వంటి మహా మహమ్మారి వరకు అన్నీ జంతువుల నుంచి మనుషులకు సోకినవే. హానికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు సోకిన జంతువులను తాకడం లేదా వాటి మాంసం తినడం, వాటి స్రావాలు, వ్యర్థాల ద్వారా.. ఇలా రకరకాల పద్ధతుల్లో ఈ వ్యాధులు మనకు సంక్రమిస్తాయి. 

చైనాలోని వూహాన్‌ నగరంలో గతేడాది డిసెంబర్‌లో అక్కడి జంతు మార్కెట్‌ నుంచే కరోనా వైరస్‌ మనుషులకు సోకిందని వైద్య నిపుణుల తాజా అంచనా. ఇది నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పరిశోధనలు ప్రారంభించింది. కరోనా మాట అటుంచితే అటవీ ప్రపంచంలో జంతువులతోపాటు మనుషులకూ సోకగల అనేక ఇతర వ్యాధులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూలై 6న వరల్డ్‌ జూనోసిస్‌ డే నిర్వహిస్తున్నారు. 1885 జూలై 6న ఫ్రెంచ్‌ బయాలజిస్ట్‌ లూయీ పాశ్చర్‌ రేబిస్‌ వ్యాధి చికిత్సకు తొలి వ్యాక్సిన్‌ ప్రయోగించింది ఈ రోజునే! అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది వరల్డ్‌ జూనోసిస్‌ డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించట్లేదు. వన్‌ హెల్త్‌ పౌల్ట్రీ హబ్‌ అనే పరిశోధన సంస్థ కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా రెండు నిమిషాల మౌనం పాటించనుంది.

మరిన్ని వార్తలు