ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన శాంసంగ్‌

23 Nov, 2018 16:08 IST|Sakshi

సెమీకండక్టర్‌, ఎల్‌సీడీ ఫ్యాక్టరీ కారణంగా క్యాన్సర్‌ బారిన పడిన ఉద్యోగులు

ఉద్యోగులకు శాంసంగ్‌  క్షమాపణ

ప్రతి బాధితుడికి పరిహారం

సియోల్‌ : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌  ఎట్టకేలకు ఉద్యోగులకు క్షమాపణలు  చెప్పింది. తమ ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా కొంతమంది ఉద్యోగులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని  అంగీకరించిన సంస్థ  శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. తద్వారా  దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. తమ ఎల్‌సీడీ,  సెమీ కండక్టర్‌  కర్మాగారాల్లో  కార్మికుల భద్రత కోసం సరియైన రక్షణచర్యలు తీసుకోలేకపోయామని  శాంసంగ్‌ వెల్లడించింది. వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని శాంసంగ్‌  కో ప్రెసిడెంట్‌  కిమ్‌ కి నామ్‌  ప్రకటించారు. అలాగే ఒక్కో బాధితుడికి సుమారు 9లక్షల రూపాయలు (133వేల డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించారు.  దీంతో గత పదేళ్లుగా పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులు శాంతించారు.

తాజాగా శాంసంగ్‌ క్షమాపణలు చెప్పడంపై ఉద్యమ కారుల్లో ఒకరు, బాధిత మహిళ ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ‍్యక‍్తం చేశారు. తన 22 కుమారుడు  2007లో లుకేమియాతో కన్నుమూశాడని వెల్లడించారు.  కంపెనీ క్షమాపణ కుటుంబాల బాధను  ఏ మాత్రం తీర్చలేదని, నిజానికి  సంస్థ  ప్రకటించిన పరిహారం కుటుంబాలకు సరిపోదు కానీ, తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎందుకంటే తమ బంధువుల మరణంతో , తాము అనుభవించిన వేదన ఎన్నటికీ  తీరనిదనీ, చాలా కుటుంబాలది  ఇదే పరిస్థితని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  
 


కాగా దక్షిణ సియోల్‌లోని సువాన్‌లో శాంసంగ్‌ నెలకొల్పిన సెమీకండక్టర్‌, ఎల్‌సీడీ ఫ్యాక్టరీ వివాదానికి దారితీసింది. అనేకమంది అతిప్రమాదకరమైన క్యాన్సర్‌ బారిన పడుతున్నామంటూ ఉద్యోగులు 2007లో  పోరాటానికి దిగారు. దాదాపు 320 మంది ఉద్యోగులు క్యాన్సర్‌ బారినపడగా, 118 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్‌లు వ్యాప్తి చెందాయి. అలాగే కొన్ని ఇతర అరుదైన తీవ్ర అనారోగ్యంతోపాటు,  గర్భస్రావాలు,  కార్మికుల పిల్లలు తీవ్రమైన కంటి రోగాల బారిన పడ్డారని ఉద్యమ కమిటీ వాదించింది.

>
మరిన్ని వార్తలు