‘ఇప్పటికైనా ఆ నెత్తుటి మరకలు తుడిచేస్తే బాగుంటుంది’

26 Nov, 2018 10:29 IST|Sakshi

తను నోరు తెరచి ఏం చెప్పడు. కానీ చీకటి పడిందంటే చాలు ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేయమంటాడు. కాస్త వెలుతురు తక్కువగా ఉన్నా సరే తనకి నిద్ర పట్టదు. చీకటి అంటే అంతలా భయపడిపోతాడు మోషె- సాండ్రా సామ్యూల్‌, 26/11 ఉగ్రదాడిలో బాలుడిని రక్షించిన మహిళ

సరిగ్గా పదేళ్ల క్రితం... రోజూలాగానే తన విధులు నిర్వర్తిస్తున్నాడు రబ్బీ గావ్రిల్‌. చాబాద్‌ హౌజ్‌ను దర్శించడానికి వచ్చిన వారికి యూదు మత ప్రాశస్త్యం, చాబాద్‌ ఉద్యమాల గురించి చెబుతున్నాడు. ఆ సమయంలో గావ్రిల్‌తో పాటు గర్భవతి అయిన భార్య రివిక, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగుతోంది. కానీ అంతలోనే ఒక్కసారిగా బాంబుల శబ్దం వినబడింది. ఏదో ప్రమాదం జరగబోతోందని ఊహించిన గవ్రిల్‌తో పాటు అక్కడున్న టూరిస్టులంతా అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే చాబాద్‌ హౌజ్‌ను ముట్టడించిన లష్కరే ముష్కరులు బాంబులతో దాడి చేసి 9 మంది ప్రాణాలను పొట్టనబెట్టకున్నారు. ఈ దుర్ఘటనలో గావ్రిల్‌ చిన్న కొడుకు మోషె మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. ప్రాణాలకు తెగించి మరీ అతడిని కాపాడింది.. అతడి ఆయా సాండ్రా సామ్యూల్‌. ఆమె సాహసానికి గానూ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం.. 2010లో ఇజ్రాయిల్‌ పౌరసత్వం ఇచ్చి సత్కరించింది.

తన కొడుకు, కోడలు ముద్దులొలికే ఇద్దరు మనుమలు మరణించారనే విషయం తెలియగానే గావ్రిల్‌ తండ్రి మోషెను ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లాడు. మోషెకు ఇప్పుడు పన్నెండేళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది.. బామ్మాతాతయ్య, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాహ్యుతో పాటు మరోసారి భారత్‌కు వచ్చాడు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి చాబాద్‌ హౌజ్‌(ప్రస్తుతం నారీమన్‌ లైట్‌హౌజ్‌గా నామకరణం చేశారు)లో ఆఖరిసారిగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. బహుషా తనకు వాళ్ల రూపం పూర్తిగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన జరిగే నాటికి అతడు రెండేళ్ల పిల్లాడు. కానీ ఆ ఘటన తాలూకు ప్రభావం ఇప్పటికీ తనపై ఉందంటున్నారు సాండ్రా. 26/11 ఉగ్రదాడిలో ఎంతో మంది సామాన్య ప్రజలు, వీరులు అసువులు బాసారు.. కానీ ఏదో అద్భుతం జరిగినందు వల్లే నేను మోషె ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు సాండ్రా.


ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు : సాండ్రా
మోషెతో పాటు సాండ్రా కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోనే ఉంటున్నారు. అలే జెరూసలేం సెంటర్‌లో దివ్యాంగులైన పిల్లల బాగోగులను చూసే సాండ్రా.. ప్రతీ శనివారం మోషెను కలుస్తారట. ’ తను నోరు తెరచి ఏం చెప్పడు. కానీ చీకటి పడిందంటే చాలు ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేయమంటాడు. కాస్త వెలుతురు తక్కువగా ఉన్నా సరే తనకి నిద్ర పట్టదు. చీకటి అంటే అంతలా భయపడిపోతాడు’ అంటూ ప్రస్తుతం మోషె ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకొచ్చారు సాండ్రా. 


‘చాబాద్‌ హౌజ్‌లోని నాలుగో, ఐదో అంతస్తులను అలాగే ఉంచేసారు. మూడో అంతస్తులో ఉన్న నిర్మాణాలన్నీ ధ్వంసం చేశారు. అక్కడున్న పిల్లర్లపై ఇంకా రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. అదంతా చూసినపుడు నా ఒళ్లు గగుర్పొడించింది. భయంతో వణికి పోయా. నాకొక విషయం మాత్రం అర్థం కాలేదు. ఆరోజు మరో తొమ్మిది చోట్ల కూడా ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. అయితే అక్కడ కూడా ఇందుకు సంబంధించిన చేదు ఙ్ఞాపకాలను అలాగే ఉంచారా లేదా కేవలం ఒక్క చాబాద్‌ హౌజ్‌లోనేనా? కానీ అలా ఉంచడం వెనుక వారి లాజిక్‌ ఏంటో నాకు అర్థం కాలేదు. మేలో ఇక్కడికి వచ్చినపుడు గమనించలేదు. కానీ మరోసారి ఆ ఫొటోలు చూస్తుంటే ఇవన్నీ గుర్తుకువస్తున్నాయి. కానీ నెత్తుటి మరకలు తుడిచేస్తే బాగుంటుంది’  అని ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాండ్రా తన అభిప్రాయయాన్ని వెలిబుచ్చారు. ఏదేమైనా సరే ప్రతీ రెండేళ్లకోసారి కుమారులను చూసేందుకు ముంబైకి కచ్చితంగా వస్తారట.

మరిన్ని వార్తలు