తస్కరించాలని చూస్తే.. ఇక అంతే!

23 Oct, 2016 02:35 IST|Sakshi
తస్కరించాలని చూస్తే.. ఇక అంతే!

సైకిల్ ఎక్కడైనా పెట్టి తాళం వేసి ప్రశాంతంగా ఉండగలమా? ఎంత తాళాలు వేసినా ఎవరు దొంగిలిస్తారో అని అనుమానంగానే ఉంటుంది. మిగిలిన తాళాల సంగతి ఏమోగానీ.. తాము తయారు చేసిన సరికొత్త తాళం వాడితే మాత్రం సైకిళ్లు ఎక్కడికీ పోవని తయారీదారులు గ్యారంటీగా చెబుతున్నారు. ఎందుకంటే ఎవరైనా దొంగలు ఆ తాళం తీయాలని ప్రయత్నిస్తే వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయట! షంక్‌లాక్ అనే ఈ కొత్త తాళాన్ని తాము విభిన్నంగా తయారు చేశామని దీని తయారీదారుడు అమెరికాలోని శానిఫ్రాన్సిస్‌కోకు చెందిన డేనియల్ ఇడ్జ్‌కోవ్‌స్కీ చెబుతున్నారు.

తమ సైకిళ్లు కూడా తాళాలు వేసి పెట్టినా పోయాయని, అందుకే కాస్త బలమైన తాళం తయారు చేయాలని అనుకున్నామని ఇడ్జ్‌కోవ్‌స్కీ తెలిపారు. ఆరు నెలల పాటు కష్టపడి ఆలోచించిన తర్వాత ఈ షంక్‌లాక్ అనే కొత్తరకం తాళం తయారుచేశామన్నారు. దీన్ని ఎవరైనా కోయాలని ప్రయత్నించగానే.. లోపల ఒక రకమైన రసాయనం ఉంటుందని, అది దొంగల శరీరంలోకి ప్రవేశించి, వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయని అన్నారు. నేరుగా తాళం చెవి పెట్టి తీస్తే మాత్రమే ఇది సురక్షితమని.. అలా కాకుండా మరే రకంగా తెరవాలని ప్రయత్నించినా అవతలి వాళ్ల పని అంతేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ తాళం ధర మన కరెన్సీలో రూ. 6,621 మాత్రమే.

మరిన్ని వార్తలు