సత్యనాదెళ్ల వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు

10 Oct, 2014 09:45 IST|Sakshi
సత్యనాదెళ్ల వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వారికి ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహిళలు కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నా, జీతాల పెంపు విషయంలో మాత్రం అసలు సంతృప్తిగా ఉండట్లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించినప్పుడు నాదెళ్ల స్పందించారు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని, అప్పుడు మనకు పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. మహిళలు జీతాల పెంపు గురించి అడగక్కర్లేదని, వాళ్లు సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగొస్తుందని అన్నట్లు తెలిసింది.

అయితే సత్య నాదెళ్ల వాదనతో ఆ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యురాలు, కాలేజి ప్రెసిడెంట్ మారియా క్లావే తీవ్రంగా విభేదించారు. వెంటనే ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఒకే ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు వస్తున్నాయని ఇప్పటికే పలు పరిశోధనలలో తేలింది. దీన్ని కూడా పరిష్కరించాలని, ఇందుకోసం మహిళలు హోంవర్క్ చేయాలని క్లేవ్ సలహా ఇచ్చారు.

అయితే, ఈ వివాదానికి సత్యనాదెళ్ల ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పరిశ్రమలో వేతనాల విషయంలో లింగ వివక్ష తగ్గాలని ఆయన అన్నారు. కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు సూచించడంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ ఓ మెమో కూడా పంపినట్లు తెలిసింది. ఆ ప్రశ్నకు అంతకుముందు తానిచ్చిన సమాధానం తప్పని కూడా అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు