మక్కా సందర్శనపై తాత్కాలిక నిషేధం

27 Feb, 2020 15:28 IST|Sakshi

రియాద్‌: సౌదీ అరేబియాలోని మక్కా లేదా మదీనా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు సౌదీ విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. కోవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. మక్కాను సందర్శించేందుకు ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనను అనుమతిస్తామని, ఇక ముందు, ముఖ్యంగా కోవిడ్‌ వైరస్‌ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం అనుమతించమని ప్రకటనలో సౌదీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ప్రతి ఏడాది జరిగే హజ్‌ యాత్ర సందర్భంగా జూలై నెలలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు పవిత్రమైన ప్రధాన ఇస్లాం మత క్షేత్రాల్లో మక్కాను ఒకటిగా భావిస్తారు. అందుకనే ఒక్క జూలై నెలలోనే దాదాపు 30 లక్షల మంది మక్కాను సందర్శిస్తారు. మక్కా సందర్శనపై ప్రస్తుతం విధించిన నిషేధాన్ని జూలై నాటికి ఎత్తి వేస్తారా, కొనసాగిస్తారా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. (చదవండి: అన్ని వైరస్‌ల కన్నా ప్రాణాంతకం ఇదే..)

మరిన్ని వార్తలు