ఫ్యామిలీకి పన్ను పోటు!

21 Jun, 2017 20:31 IST|Sakshi
ఫ్యామిలీకి పన్ను పోటు!
 సౌదీ వలస కుటుంబాలపై పెను భారం 
 ► ఆర్థిక సంక్షోభం గట్టెక్కేందుకు వలస కుటుంబాలపై సౌదీ కన్ను
 ► ఒక్కో కుటుంబ సభ్యునికి నెలకు 100 రియాళ్లు 'ఆశ్రిత పన్ను'
 ► మూడేళ్ల పాటు ఏటా మరో 100 రియాళ్లు పెరగనున్న వైనం 
 ► సౌదీ వలసల్లో 41 లక్షల మందితో భారతీయులదే అగ్రస్థానం
 ► అందులోనూ 10 లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల వలసలే 
 ► ఆశ్రిత పన్ను ఫలితంగా స్వస్థలాలకు తరలివస్తున్న కుటుంబాలు 
 
(సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌) 
సౌదీ అరేబియా..! ఉపాధి, ఉద్యోగాన్వేషణలో చాలా మంది భారతీయులకు ఒక ఆశాకిరణం. అక్కడ ప్రస్తుతం దాదాపు 41 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది సౌదీ ప్రయాణమవుతుంటారు. కానీ మరో పది రోజుల్లో ఈ ఎడారి దేశంలో విదేశీయులకు గడ్డు పరిస్థితులు రానున్నాయి. చాలా మంది భారతీయులు తమ కుటుంబ సభ్యులను సౌదీ నుంచి స్వస్థలాలకు పంపించేసి బ్యాచిలర్‌ జీవితాలు గడిపేందుకు సిద్ధమవుతున్నారు. కారణం.. జూలై నెల నుండి విదేశీయులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల మీద సౌదీ సర్కారు కొత్త పన్ను వసూలు చేయనుంది. ఒక్కో ఆశ్రితుని మీద నెలకు 100 సౌదీ రియాళ్లు (సుమారు రూ. 1,723) చొప్పున 'ఆశ్రిత పన్ను' వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ పన్ను మొత్తం కూడా ప్రతి ఏటా క్రమంగా పెరుగుతుందని చెప్తున్నారు. 
 
ఎందుకీ పన్ను?
అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం వల్ల.. చమురు నిక్షేపాలపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలైన సౌదీ వంటి అరేబియా దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాచరిక పాలనలోని సౌదీ అరేబియాలో కూడా నిధుల లోటు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకోవడానికి వలసల మీద కన్నేసిన ప్రభుత్వం 'ఆశ్రిత పన్ను' విధించింది. నిజానికి సౌదీ అరేబియాలోని కంపెనీలు తమ ఉద్యోగుల్లో స్థానికుల కన్నా విదేశీ ఉద్యోగులు ఎక్కువ ఉంటే.. వారికి ఒక్కొక్కరికి నెలకు 200 సౌదీ రియాళ్లు పన్ను కింద వెచ్చిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం తమ దేశంలో నివసించే విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులపైనా పన్ను విధించడంతో వారిలో కలకలం మొదలైంది. దీంతో పెద్ద సంఖ్యలో భారతీయ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపించి వేస్తున్నారు. 
 
పన్ను ప్రభావం ఏమిటి? 
సౌదీ అరేబియాలో నెలకు 5,000 రియాళ్లు (సుమారు రూ. 86,000) వేతనం గల వారందరికీ ఆ దేశ సర్కారు కుటుంబ వీసా ఇస్తుంది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక విదేశీ ఉద్యోగి నెలకు 300 రియాళ్లు (సుమారు రూ. 5,400) చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఈ పన్ను 2020 వరకూ ఏటా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 100 రియాళ్ల చొప్పున పెరుగుతుంది కూడా. అంటే.. 2020 నాటికి  మరో మూడేళ్లకు భార్య, ఇద్దరు పిల్లలు గల ఒక విదేశీ ఉద్యోగి నెలకు 1200 రియాళ్లు పన్నుగా చెల్లించాలి. అదీగాక.. ఈ పన్నును ముందస్తుగానే చెల్లించివేయాలి. అంటే కుటుంబ సభ్యుల నివాస అనుమతిని పునరుద్ధరణ చేసుకునే సమయంలోనే ఒక్కో సభ్యుడికి సంబంధించిన ఏడాది ఆశ్రిత పన్ను మొత్తం చెల్లించివేయాలి. భార్య, ఇద్దరు పిల్లల కోసం 3,600 రియాళ్లు  సుమారు రూ. 64,000 ముందుగా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. మిగతా పన్నుల విషయంలోనూ సౌదీ సర్కారు కొరడా ఝళిపిస్తోంది. జూలై ఒకటో తేదీ నుంచి మద్యపానీయాలు, పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. అయితే ఆశ్రిత పన్ను వల్ల ప్రభుత్వ ఆదాయం తాత్కాలికంగా పెరిగినా ముందుముందు అది దేశ ఆర్థిక రంగానికి ఇబ్బందికరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
భారతీయులు ఎందరు? 
విదేశీ కార్మికులను దిగుమతి చేసుకునే విషయంలో సౌదీలో ఆంక్షలు చాలా తక్కువ. ఈ దేశంలో ఆదాయ పన్ను అనేదే లేదు. సౌదీ పౌరులైనా, విదేశీ వలసలైనా ఎవరూ ఆదాయ పన్ను కట్టక్కరలేదు. ఈ విధానం ఇక ముందూ కొనసాగుతుందని సౌదీ సర్కారు ఉద్ఘాటిస్తోంది. ఉద్యోగుల వలసపై ఆంక్షలు లేకపోవడం, ఆదాయ పన్ను లేకపోవడం.. ఈ రెండు కారణాల వల్ల భారతీయులు అత్యధిక సంఖ్యలో సౌదీకి ఉద్యోగ, ఉపాధిల కోసం వలస వస్తున్నారు. సౌదీ అరేబియాలో నివసించే విదేశీయుల్లో భారతీయులదే అగ్రస్థానం. సౌదీ సర్కారు విధించిన కొత్త పన్ను ప్రభావం అక్కడి భారతీయుల మీదే అధికంగా ఉంటుంది. భారతదేశం వెలుపల భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం కూడా సౌదీ అరేబియానే. దాదాపు 400కు పైగా సంస్థల్లో సుమారు 41 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇందులో నాలుగో వంతు మంది అంటే 10 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన తెలుగు వారే. వారిలో అత్యధికులు గత నాలుగు నెలలుగా తమ కుటుంబ సభ్యులను స్వస్థలాలకు పంపించివేస్తున్నారు. 

 

మరిన్ని వార్తలు