భారత్‌ నుంచి హజ్‌ కోటా పెంపు!

29 Jun, 2019 09:15 IST|Sakshi

1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతామని సౌదీ రాజు హామీ

ఒసాకా: భారత్‌ నుంచి ఏటా హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హజ్‌ కోటా పెంపుపై ఇరువురు చర్చించుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.

హజ్‌ కోటాను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతామని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. మోదీకి హామీ ఇచ్చి నట్లు విజయ్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య పర్యా టకం పెంపొందించేందుకు విమాన సేవలు పెంచేం దుకు ఇరువురు మరోసారి సమావేశం అయ్యేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది సౌదీ అరేబియాలో జరగబోయే ఓ అంతర్జాతీయ సదస్సుకు మోదీని ఆహ్వానించారని, ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మక్కా కు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను గతేడాది 1,300 మందిని అనుమతించారు. 

మరిన్ని వార్తలు