సౌదీ అరేబియాలో 35 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్‌

20 Apr, 2018 01:33 IST|Sakshi

రియాద్‌ : కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను బుధవారం ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఈ థియేటర్‌లో మొదటగా ‘బ్లాక్‌ పాంథర్‌’  సినిమాను ప్రదర్శించారు. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను వీక్షించారు. మతపరమైన కారణాల వల్ల ఇన్నేళ్ల పాటు సౌదీలో ఒక్క థియేటర్‌ కూడా అందుబాటులో లేదు.

ఈ సందర్భంగా సౌదీ సాంస్కృతిక  సమాచార శాఖా మంత్రి అవద్‌ అల్వాద్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు, ఫిల్మ్‌ మేకర్స్‌ థియేటర్‌కి విచ్చేశారు. అల్వాద్‌ మాట్లాడుతూ దేశంలోకి తిరిగి సినిమాను ఆహ్వానించడం ద్వారా దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామన్నారు. ఇకపై వినోద పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో సౌదీ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెరిగిందని స్థానిక మీడియా పేర్కొంది.

దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భావించారని.. అందుకే  విజన్‌ 2030 పేరిట పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని సాంస్కృతిక  సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2030 నాటికి 350 సినిమాలను, 2500 స్క్రీన్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు