సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు

28 Apr, 2020 05:36 IST|Sakshi
సౌదీ అరేబియా రాజు సల్మాన్‌

దుబాయ్‌: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్‌ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం.

దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్‌ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్‌ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్‌ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై   సల్మాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు