ఖషోగ్గీ హత్య; సౌదీ యువరాజు కీలక వ్యాఖ్యలు

26 Sep, 2019 17:27 IST|Sakshi

రియాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్‌ బిన్‌ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్‌ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్‌ మహ్మద్‌ బిన్‌ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్‌ బిన్‌ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్‌ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు.

కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది.

మరిన్ని వార్తలు