ఇరాన్‌పై సౌదీ రాజు సంచలన వ్యాఖ్యలు

30 Sep, 2019 12:32 IST|Sakshi

ఇరాన్‌పై చర్యలు తీసుకోండి - సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌

లేదంటే ఊహించని స్థాయికి చమురు ధరలు

శాంతియుత, రాజకీయ పరిష్కారమే  మంచిది!

ఇరాన్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రాకపోతే మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హెచ్చరించారు. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చమురు ధరలు మన జీవితకాలంలో చూడని అనూహ్య రీతిలో  పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌  కార్యక్రమం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హెచ్చరించారు. ముఖ‍్యంగా సైనిక చర్యకంటే..రాజకీయపరమైన, శాంతియుత పరిష్కారమే మంచిదని తాము భావిస్తున్నామంటూ ప్రకంపనలు రేపారు. ఇరాన్‌తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇది ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని సౌదీ ఆరోపిస్తోంది. మరోవైపు సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై జరిగిన డ్రోన్‌ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్‌ తమ ప్రమేయం లేదని ఇరాన్ కొట్టిపారేసింది.

కాగా ఏడాది క్రితం జరిగిన వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు.  సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు