నగ్నసత్యాలు వెల్లడిస్తా: ఎర్దోగన్‌

23 Oct, 2018 03:34 IST|Sakshi
టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌, జమాల్‌ ఖషోగ్గీ

ఖషోగ్గీ హత్యపై నేడు మాట్లాడనున్న టర్కీ అధ్యక్షుడు

మాట మార్చిన ట్రంప్‌

ఇస్తాంబుల్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ కంట్రిబ్యూటర్‌ జమాల్‌ ఖషోగ్గీ తమ రాయబార కార్యాల యంలో జరిగిన గొడవలోనే మరణించాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు ఒప్పుకోవడం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. ఖషోగ్గీ హత్య విషయంలో కొన్ని నగ్నసత్యాలను బయటపెడతామని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌ ప్రకటించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖషోగ్గీ కేసు విషయానికి సంబంధించి తాను మంగళవారం ప్రసంగిస్తాననీ, అప్పుడు కొన్ని కొత్త విషయాలను చెబుతానని ఎర్దోగన్‌ గత వారాంతంలోనే ప్రకటించారు. టర్కీ అధికార పార్టీ ప్రతినిధి, ఎర్దోగన్‌కు సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ ‘ఇది పథకం ప్రకారం, క్రూర, దారుణ కుట్రతో జరిగిన హత్య’ అని ఆరోపించారు.

అటు జర్మనీ కూడా ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సౌదీకి ఎగుమతి చేయాల్సిన 480 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయాన్ని నిలిపేస్తోందని ఆ దేశ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఖషోగ్గీ హత్య విషయంలో ఏం జరిగిందో విశ్వసనీయ ఆధారాలతో సౌదీ అత్యవసరంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంద న్నాయి. ఖషోగ్గీ మృతి విషయంలో సౌదీ వివరణ నమ్మశక్యంగానే ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మాట మార్చి సౌదీ అబద్ధాలు చెబుతోందన్నారు. ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌కు సౌదీ యువరాజుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రంప్‌ సొంత పార్టీ నేతలు కూడా యువరాజుకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నమ్ముతున్నామన్నారు.

15 ముక్కలుగా నరికేశారు
సౌదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, యువరాజు సల్మాన్‌ను విమర్శిస్తూ ఖషోగ్గీ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. టర్కీ మహిళను పెళ్లి చేసుకునేందుకు అవసరమైన పత్రాలు పొందే విషయమై ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీకి ఈ నెల 2న వెళ్లిన ఆయన అక్కడే హత్యకు గురయ్యారు.  హురియత్‌ అనే పత్రికలో వ్యాసాలు రాసే అబ్దుల్‌ఖదీర్‌ మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఖషోగ్గీ గొంతు నులిమి చంపిందన్నారు. అనంతరం లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న సలాహ్‌ మహ్మద్‌ అల్‌–తుబైగీ సంగీతం వింటూ ఖషోగ్గీ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేశారన్నారు.

మరిన్ని వార్తలు