అమెరికాలో సౌదీ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

23 Jan, 2019 15:19 IST|Sakshi

వాషింగ్టన్‌ : గతేడాది అక్టోబరులో అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సౌదీ అక్కాచెల్లెళ్ల మరణ మిస్టరీ వీడింది. వీరిద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని న్యూయార్క్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మంగళవారం నివేదిక అందించారు.  వివరాలు.. సౌదీ అరేబియాకు చెందిన రొటానా ఫారియా(22), ఆమె సోదరి తాలా(16) ఫారియా శవాలు హడ్సన్‌ నది సమీపంలో లభ్యమైయ్యాయి. వీరిద్దరి కాళ్లు టేప్‌తో చుట్టబడి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో వీరిది ఆత్మహత్య అని తేలడంతో  ఫారియా సిస్టర్స్‌ గురించి ఆరా తీయగా ఆశ్చర్యకర విషయాలు బయటికి వచ్చాయి.

సౌదీకి వెళ్లడం కంటే చావడమే నయం!
సౌదీకి చెందిన రొటానా, తాలాలు కుటుంబ సభ్యుల ఆంక్షలు తట్టుకోలేక న్యూయార్క్‌లో ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇందుకు అనుమతి లభించకపోవడంతో వర్జీనియా నుంచి తిరిగి సౌదీకి పంపిస్తారేమోనని భావించిన ఈ అక్కాచెల్లెళ్లు న్యూయార్క్‌కు పారిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో సౌదీకి తిరిగి వెళ్లడం కంటే చావడమే నయమని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.(‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’)

ఇక ఈ విషయంపై అమెరికా ఎంబసీలోని సౌదీ అరేబియా అధికార ప్రతినిధి ఫాతిమా బాసిన్‌ స్పందించారు. ‘ సౌదీకి చెందిన అక్కాచెల్లెళ్లు తాలా, రొటానా ఫారియాల బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారి శవాలను తీసుకువెళ్లగలరు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. అమెరికాలో ఆశ్రయం పొం‍దడానికి వారు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు అవాస్తవం’ అని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా.. వర్జీనియాలో ఉండే ఇంటి నుంచి వారిద్దరు అనేకసార్లు పారిపోయారని.. 2017 నుంచి న్యూయార్క్‌లోని వివిధ హోటళ్లలో బస చేసినట్లు తేలిందని ఆమె పేర్కొన్నారు.

కాగా కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక సౌదీకి చెందిన రహాఫ్‌ మహ్మద్‌ మలేషియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస శరణార్థి సంస్థ జోక్యం చేసుకుని కెనడాలో ఆమెకు ఆశ్రయం కల్పించింది. అంతేకాకుండా , ఆంక్షల చట్రం బయటపడేందుకు ప్రయత్నించిన దుబాయ్‌ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇటీవలే ఇంటికి చేరుకున్నారు కూడా. ఈ క్రమంలో సంప్రదాయాల పేరిట సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ఇంటి నుంచి పారిపోయిన ఫారియా సిస్టర్స్‌ ఆత్మహత్యపై సౌదీ ఎలా స్పందిస్తుందోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.(‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’)

>
మరిన్ని వార్తలు