‘ఈ కథ ముగిసింది.. ఇకపై తను అక్కడే ఉంటుంది’

12 Jan, 2019 08:50 IST|Sakshi

బ్యాంకాక్‌ : గృహహింస తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి థాయ్‌లాండ్‌కు వచ్చిన సౌదీ యువతి రహఫ్‌ ముహమ్మద్‌ అల్‌ఖునన్‌.. ఇకపై కెనడాలో ఆశ్రయం పొందనున్నారని థాయ్‌లాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ ముఖ్య అధికారి సురాచత్‌ హక్‌పర్న్‌ తెలిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ కెనడియన్‌ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ‘ఈ కథ నేటితో ముగిసింది. కుమారి రహాఫ్‌ తన అభీష్టం మేరకు కెనడాకు వెళ్తున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి టొరంటో వెళ్లే విమానంలో ఆమె బయల్దేరారు. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రహాఫ్‌ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. కెనడాకు బయల్దేరుతున్నపుడు ఆమె ముఖం నవ్వుతో వెలిగిపోయింది’ అంటూ సురాచత్‌ పేర్కొన్నారు.

కాగా సౌదీకి చెందిన పద్దెమినిదేళ్ల యువతి రహాఫ్‌ మహ్మద్‌ అల్‌ఖునన్‌ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతకాలని ఉందంటూ గత శనివారం థాయ్‌లాండ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రహాఫ్‌ వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో థాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆమెను తిరిగి స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా తన పరిస్థితిని మీడియా, ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లిన రహాఫ్‌... ప్రస్తుతం శరణార్థిగా గుర్తింపు పొంది కెనడాలో ఆశ్రయం పొందనున్నారు. (చదవండి : ‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’)

ఆమె కెనడాలో ఉండవచ్చు : ట్రూడో
రహాఫ్‌ కెనడాలో జీవించేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో అంగీకారం తెలిపారు. ‘ మానవ హక్కులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో కెనడా అర్థం చేసుకోగలదు. బాధితుల తరపున నిలబడేందుకు మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం. మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను అనుసరించి ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ చేసిన అభ్యర్థనను మన్నిస్తున్నా’ అని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ‍కాగా రహాఫ్‌ వ్యవహారంతో కెనడా- సౌదీల మధ్య ఉన్న బంధం మరింత బలహీనపడనుంది. గతంలో.. మహిళా కార్యకర్తలను అడ్డుకున్న సౌదీ అధికారుల తీరును విమర్శిస్తూ కెనడా ప్రతినిధులు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కెనడియన్‌ రాయబారి రియాద్‌ రాకుండా సౌదీ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు