ఏంటీ.. ఇది ఆక్సిజన్‌ లేకుండానే బ్రతికేస్తుందా!

27 Feb, 2020 16:46 IST|Sakshi

ఆక్సిజన్‌ లేనిదే జీవుల మనుగడ లేదు. ఇది మనం చిన్నప్పుడు సైన్స్‌ పుస్తకాల్లో చదువుకున్నాం. అదే సత్యం కూడా. అయితే కొన్ని రకాల పరాన్న జీవులు కొద్ది రోజుల పాటు ఆక్సిజన్‌ పీల్చుకోకుండా బతకగలవు కానీ.. పూర్తిగా అయితే బతకలేవన్నది శాస్త్రవేత్తల నమ్మకం. కానీ ఓ పరాన్నజీవి మాత్రం ఆక్సిజన్‌ లేకుండానే బ్రతికేస్తుందని.. టెట్‌ ఏవీవ్‌ యూనివర్శిటీ పరిశోధకుల తాజా ఆధ్యయనంలో తేలింది. ఆ జీవి పేరు హెన్నెగుయా సాల్మినికోలా. ఇది 10 కణాల కంటే తక్కువగా ఉండే సాల్మన్‌ చేపల కండరాలల్లో పరాన్న జీవిగా నివసిస్తుంది. ఇది అత్యంత చిన్న జీవి. కాగా ఇజ్రాయిల్‌లోని టేల్‌ ఏవీవ్‌ యూనివర్శిటీ పరిశోధకులు సముద్ర భూగర్భంలో సాల్మన్‌ చేపల్లో ఈ జీవిని కనుగొన్నారు. ఈ క్రమంలో లైఫ్‌ సైన్స్‌, నేచురల్‌ హిస్టరీలోని జువాలజీ స్కూల్‌ ప్రొఫెసర్‌ డోరతి హుచోన్‌ ఆధ్వర్యంలో యూనివర్శిటీ పరిశోధకులు దీనిపై పరిశోధన చేశారు. హుచోన్‌ పరిశోధనలో ఇది శ్వాస లేకుండానే బ్రతికేస్తున్నట్లు వెల్లడైంది. (చదవండి: అక్కడ ప్రతి 16 నిమిషాలకో ప్రమాదం)


ఈ విషయం గురించి ప్రొఫెసర్‌ హుచోన్‌ మాట్లాడుతూ.. ‘ఏరోబిక్‌ శ్వాసక్రియ జంతువులలో సర్వవ్యాప్తి చెందుతుందని సైన్స్‌ ప్రకారం రుజువైన విషయం కానీ ఇక్కడ ఈ జీవి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఏరోబిక్‌ శ్వాసక్రియ జీవుల శక్తి ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఆక్సీజన్‌ లేకుండా ఈ జీవి శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటుందో మాకు ఇంకా స్ఫష్టత రాలేదు’ అని ఆయన చెప్పారు. ‘ఒకవేళ ఇది చుట్టుపక్కల ఉన్న చేపల కణాల నుంచి ఆక్సిజన్‌ పొందుతుందేమోనని మా అభిప్రాయం. కానీ అదే కచ్చితమని స్పష్టంగా చెప్పలేము. ఈ విషయంపై పరిశోధన జరుపుతున్నాము. అయితే ప్రస్తుతం ఈ బహుకణజీవి మాత్రం వాయురహిత జీవిగా పరిశోధనలో వెల్లడైంది’ అని తెలిపారు. (చదవండి: అన్ని వైరస్‌ల కన్నా ప్రాణాంతకం ఇదే..)

మరిన్ని వార్తలు