సూర్యుడు ఉన్నంతకాలం!

16 Jul, 2017 00:40 IST|Sakshi
సూర్యుడు ఉన్నంతకాలం!

లండన్‌: మనుషులు, కీటకాలు, ఇతర జీవజాతుల ఆయుషు ఎంతో మనకు తెలిసిందే. అయితే సూర్యుడు ఉన్నంతకాలం జీవించే అరుదైన సూక్ష్మ జంతువు ఒకటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎనిమిది కాళ్లు ఉండే టార్డిగ్రేడ్‌ అనే జంతువు సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్‌ సంవత్సరాలు బతుకుతుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు.

నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్‌ మాత్రమేనని, మైక్రోస్కోప్‌లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.అతిపెద్ద ఉల్కాపాతం, సూపర్‌ నోవా రూపంలో జరిగే నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల పేలుళ్లు వంటి ఖగోళంలో జరిగే ఈ మూడు ఘటనలను పరిశోధకులు అధ్యయనం చేశారు. భూమిపై మానవుడు నిష్క్రమించిన అనంతరం కూడా అనేక జంతుజాతులు జీవిస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పోస్ట్‌ డాక్టరోల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ రాఫెల్‌ ఆల్వ్‌ బటిస్టా వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు