వ్యవసాయ కార్మికులకు ఆస్ట్రేలియా ఆహ్వానం

6 Nov, 2018 03:59 IST|Sakshi
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌

సిడ్నీ: వ్యవసాయ కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అందజేసే వర్కింగ్‌ హాలీడే వీసా లేదా బ్యాక్‌ప్యాకర్‌ వీసాల గడువును మూడేళ్ల కాలానికి పొడిగించింది. యువతీయువకులు ఎవరైనా ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యవసాయ క్షేత్రాల్లో 6 నెలల పాటు పనిచేస్తే వారికి మూడేళ్ల పాటు దేశంలో ఉండే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ఏడాది కాలానికి ఈ వీసాను జారీచేస్తారు.

ఈ ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఉత్తర ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తే వీసా గడువును మరో ఏడాది అదనంగా పొడిగించేవారు. తాజాగా ఈ రెండేళ్ల వీసా గడువును మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ చెప్పారు. ఈ నిర్ణయం 2019, జూలై నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ వీసాలకు 45 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.

>
మరిన్ని వార్తలు