మహమ్మారిపై మరో వ్యాక్సిన్‌

7 Apr, 2020 18:44 IST|Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు మరో అమెరికన్‌ కంపెనీ పరీక్షలకు సిద్ధమైంది. 40 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఎఫ్‌డీఏ అనుమతి పొందినట్టు ఇనోవియా ఫార్మాస్యూటికల్స్‌ తెలిపింది. ఫిలడెల్ఫియా,కాన్సాస్‌, మిసోరి నగరాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ నిధులతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నారు. పరిశోధన సజావుగా సాగినా మార్కెట్లో ఈ వ్యాక్సిన్‌ పూర్తిస్ధాయిలో అందుబాటులో ఉండేందుకు ఏడాది సమయం పట్టనుంది.  డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా ఇనోవియో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో పాటు కాన్సాస్ నగరంలోని సెంటర్ ఫర్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్‌లో వ్యాక్సిన్‌ పరీక్షలు జరుగుతాయని కంపెనీ వెల్లడించింది.

ప్రతి వాలంటీర్‌పై నాలుగు వారాల వ్యవధిలో రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. ఈ ప్రాథమిక అథ్యయనం చేపట్టేందుకు ఎన్‌రోల్‌మెంట్‌ను చేపట్టామని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో మెడిసిన్‌ ప్రొఫెసర్‌, ఇన్ఫెక్షన్స్‌ వ్యాధుల స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పబ్లో టెబస్‌ తెలిపారు. ఈ మహమ్మారి నుంచి వీలైనంత త్వరగా ప్రజలను కాపాడాలని కోరుకునే వారి నుంచి తమ వ్యాక్సిన్‌ పట్ల విశేషమైన ఆసక్తి వ్యక్తమవుతోందని చెప్పారు. 2012లో మెర్స్‌ వ్యాక్సిన్‌ను ఈ సంస్థ అభివృద్ది చేసింది. గత పదివారాల్లో ఐఎన్‌ఓ-4800గా పిలిచే వ్యాక్సిన్‌కు సంబంధించి వందలాది డోస్‌లను తయారు చేశామని ఇనోవియా వెల్లడించింది. కాగా ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల డోస్‌లను సిద్ధం చేసి ఎఫ్‌డీఏ ఎమర్జెన్సీ అనుమతులు రాగానే పంపిణీ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.

చదవండి : ‘లక్షణాలు లేకుండానే విరుచుకుపడుతోంది’

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు