సంకేత భాషతో హ్యాకింగ్‌కు చెక్‌!

26 Nov, 2017 01:44 IST|Sakshi

వాషింగ్టన్‌: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతతో హ్యాకింగ్‌కు పాల్పడుతూనే ఉన్నారు. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ హ్యాకింగ్‌ సమస్యకు అడ్డుకట్టవేసేందుకు అత్యంత వేగవంతమైన సంకేత భాష (ఎన్‌క్రిప్షన్‌) వ్యవస్థను అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు ఉన్న భద్రతా వ్యవస్థల కంటే తాము అభివృద్ధి చేసిన క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ (క్యూకేడీ) సంకేత వ్యవస్థ 5 నుంచి 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని డానియల్‌ గౌతియర్‌ తెలిపారు.

ఈ సంకేత భాషను హ్యాకర్లు అర్థం చేసుకోలేరని, తద్వారా హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండబోవని చెప్పారు. ‘‘ఈ వ్యవస్థ ద్వారా సమాచారం పంపుతున్న వ్యక్తికి, సమాచారాన్ని గ్రహించే వ్యక్తికి ఒక ‘కీ’అందుతుంది. ఆ ‘కీ’సహాయంతోనే అందులోని సమాచారాన్ని తెలుసుకోగలం. కీ లేకుండా సమాచారాన్ని హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించినా అందులోని సమాచారం అర్థం కాదు’’అని డానియల్‌ వివరించారు. 1984లో క్యూకేడీ వ్యవస్థను సిద్ధాంతీకరించారని, ప్రస్తుతం అధునాతన సాంకేతికతతో ఆన్‌లైన్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు