ఆయన అంతిమ ప్రయాణం అందులోనే!

4 Dec, 2018 09:12 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ బుష్‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయన భౌతికకాయాన్ని వాషింగ్టన్‌ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. బుష్‌ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్‌ ఎయిర్‌మిషన్‌ 41’ అని పేరు కూడా పెట్టారు. ఇక బుష్‌ పార్థివ దేహానికి వాషింగ్టన్‌లో నివాళులు అర్పించిన అనంతరం తిరిగి హూస్టన్‌కు తీసుకువచ్చిన తర్వాత టెక్సాస్‌లోని జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ బుష్‌ ప్రెసిడెన్షియల్‌ లైబ్రరీలో సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందుకు గానూ  ‘4141’ అనే ప్రత్యేక రైలును ఉపయోగిస్తున్నారు.

అంతిమ ప్రయాణం అందులోనే!
సీనియర్‌ బుష్‌ అంతిమ ప్రయాణం ఆయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన రైలులో సాగనుండటం విశేషం. అమెరికాలోని అతిపెద్ద రైలు రవాణా సంస్థ యూనియన్‌ పసిఫిక్‌ తమ దేశ 41వ అధ్యక్షుడు బుష్‌ గౌరవార్థం ఓ ప్రత్యేక లోకోమోటివ్‌ను రూపొందించింది. 4141 నంబరు గల ఈ లోకోమోటివ్‌ను 2005లో సీనియర్‌ బుష్‌ ప్రారంభించారు. తమ లోకోమోటివ్‌లకు భిన్నంగా 4141ను అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లుక్‌ ప్రతిబింబించేట్లుగా నీలం, తెలుపు రంగులో దీనిని రూపొందించారు. దీనిపై జార్జ్‌ బుష్‌ 41 అనే అక్షరాలను పొందుపరిచారు.

స్వయంగా ఆయనే నడిపారు..
‘4141 ఆవిష్కరణ సమయంలో నేను రైలు నడపవచ్చా అని బుష్‌ అడిగారు. చిన్నపాటి ట్రెయినింగ్‌, కొన్ని మెళకువలు చెప్పిన అనంతరం ఇంజనీర్‌ పర్యవేక్షణలో సుమారు రెండు మైళ్ల దూరం పాటు బుష్‌ లోకోమోటివ్‌ను నడిపారు’ అని యూనియన్‌ పసిఫిక్‌ రిటైర్డ్‌ జనరల్‌ డైరెక్టర్‌ మైక్‌ ఇడెన్‌ ఆనాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

1969 తర్వాత మొదటిసారి..
మాజీ అధ్యక్షుల పార్థివ దేహాలను అంతిమ ప్రయాణానికి రైళ్లను ఉపయోగించే సంప్రదాయం అబ్రహం లింకన్‌ కాలం నాటి నుంచే కొనసాగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షులు గ్రాంట్‌, గారీఫీల్డ్‌, మెకన్లే, హార్డింగ్‌, రూజ్‌వెల్ట్‌ భౌతిక కాయాలను కూడా రైళ్లలోనే తరలించినట్లు యూనియన్‌ పసిఫిక్‌ పేర్కొంది. అయితే 1969లో ఐసన్‌హోవర్‌ తర్వాత మొదటిసారిగా బుష్‌ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లడానికి, ఆయన పేరు మీదుగా రూపొందించిన లోకోమోటివ్‌ను ఉపయోగించనుండటం తమకు ప్రత్యేకమని తెలిపింది.  ‘రెండో ప్రపంచ యుద్ధంలో నేవీ పైలట్‌గా, అధ్యక్షుడిగా తన జీవిత కాలాన్నిఅమెరికా కోసం వెచ్చించిన అధ్యక్షుడు బుష్‌కు కృతఙ్ఞతలు. మీ గౌరవార్థం బుష్‌ లైబ్రరీ లోకోమోటివ్‌ను 2005లో ప్రత్యేకంగా రూపొందించాం. మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’  అంటూ ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించింది. ఈ విధంగా బుష్‌ను చివరిసారిగా దర్శించుకుని, నివాళి అర్పించే అవకాశం 4141 ద్వారా టెక్సాన్లకు దక్కింది.

కాగా వాషింగ్టన్‌లోని నేషనల్‌ క్యాథడ్రల్‌ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో మరోసారి బుష్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్‌ పక్కన బుష్‌ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు.

మరిన్ని వార్తలు