బ్రిటన్‌ లేబర్‌ పార్టీలో చీలిక

19 Feb, 2019 04:24 IST|Sakshi

లండన్‌: బ్రెగ్జిట్, యూదు వ్యతిరేక వాదం అంశాలపై బ్రిటన్‌లో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ అనురిస్తున్న విధానాలకు నిరసనగా ఏడుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. లేబర్‌ పార్టీకి రాజీనామా చేశామనీ, పార్లమెంటులో ఓ ప్రత్యేక స్వతంత్ర బృందంగా తాము వ్యవహరిస్తామని ఏడుగురు ఎంపీలు చెప్పారు. ఎంపీలు చుకా ఉమున్నా, లూసియానా బర్జర్, క్రిస్‌ లెస్లీ, ఎంజెలా స్మిత్, మైక్‌ గేప్స్, గావిన్‌ షుకర్, అన్నే కోఫీ మీడియాతో ఈ విషయం చెప్పారు. యూదులపై మత విద్వేషం, వారిని గేలి చేయడం, భయపెట్టడం వంటివి భరించలేక, బ్రెగ్జిట్‌పై పార్టీ వైఖరి నచ్చక తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని బర్జర్‌ తెలిపారు. తమకు సొంత పార్టీ పెట్టే ఆలోచనేదీ లేదన్నారు. కాగా, 1981లో నలుగురు లేబర్‌ పార్టీలో ప్రధాన నేతలు పార్టీ నుంచి బయటకొచ్చి సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ పెట్టారు. ఆ తర్వాత లేబర్‌ పార్టీలో వచ్చిన అతి పెద్ద చీలిక ఇదే కావడం గమనార్హం.

ఫేస్‌బుక్‌.. ఓ డిజిటల్‌ గ్యాంగ్‌స్టర్‌
నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం నియంత్రణలో ఫేస్‌బుక్‌ వ్యవహారశైలిపై బ్రిటన్‌ పార్లమెంటు కమిటీ మండిపడింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ను ‘డిజిటల్‌ గ్యాంగ్‌స్టర్‌’గా కమిటీ అభివర్ణించింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో ఏర్పాటైన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ డిజిటల్‌ కల్చర్, మీడియా, స్పోర్ట్‌(డీసీఎంఎస్‌) సెలక్షన్‌ కమిటీ 18 నెలల విచారణ అనంతరం నివేదికను సమర్పించింది. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ బ్రిటన్‌ పార్లమెంటు ముందు హాజరుకాకుండా ధిక్కారానికి పాల్పడ్డారని కమిటీ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌ లాంటి డిజిటల్‌ గ్యాంగ్‌ స్టర్లను చట్టానికి అతీతంగా వ్యవహరించేందుకు అనుమతించరాదని అభిప్రాయపడింది. సీఏ మాతృసంస్థ ఎస్‌సీఎల్, దాని అనుబంధ సంస్థలు భారత్, పాక్, కెన్యా, నైజీరియా ఎన్నికల కోసం నైతికతను ఉల్లంఘించి పనిచేశాయని తెలిపింది.

మరిన్ని వార్తలు