చిగురుటాకులా వణుకుతున్న శ్రీలంక

21 Apr, 2019 15:06 IST|Sakshi

కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్‌ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది.

చదవండి...(బాంబు పేలుళ్లతో రక‍్తమోడుతున్న కొలంబో)

అయితే ఈ దాడుల్లో 185మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుమారు 500మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఆరు గంటల వ్యవధిలో ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. తాజాగా దెహివాలా జులాజికల్‌ గార్డెన్‌లోని రిసెప్షన్‌ హాల్‌ వద్ద ఎనిమిదో పేలుడు జరగ్గా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

చదవండి... (శ్రీలంకలో హైఅలర్ట్‌ : వదంతులు నమ్మరాదన్న విక్రమసింఘే)

మరోవైపు శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్‌ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్‌ గార్డెన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల్లో భారతీయులు ఎవరూ ఉన్నట్టు వార్తలు రాకున్నా కొలంబోలోని భారత హైకమిషన్‌ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోం‍ది.

చదవండి...(కొలంబో పేలుళ్లు : తృటిలో బయటపడ్డ సినీ నటి)

మరిన్ని వార్తలు