బాంబు బెదిరింపులతో స్కూల్స్ మూసివేత

29 Jan, 2016 10:08 IST|Sakshi
స్కూల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు

మెల్ బోర్న్: బాంబు బెదిరింపులతో ఆస్ట్రేలియాలో పలు పాఠశాలలు మూతపడ్డాయి. క్రిస్ మస్ సెలవుల తర్వాత శుక్రవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే బాంబు బెదిరింపులు రావడంతో సిడ్నీ, మెల్ బోర్న్ లోని పలు పాఠశాలలను ఖాళీ చేయించారు. విద్యార్థులను బయటకు పంపి స్కూళ్లకు తాళం వేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో బాంబు స్క్వాడ్ బృందాలతో సోదాలు చేపట్టారు.

న్యూ సౌత్ వేల్స్ లో ఏడు పాఠశాలలు మూతపడినట్టు పోలీసులు తెలిపారు. పెన్ రిత్, రిచ్ మండ్, మోనా వాలే, అబర్ వాలే, వూలూవారే, ఉల్లాడుల్లా, లేక్ ఐలావర్రాలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు వెల్లడించారు. విక్టోరియాలో నాలుగు పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్టు చెప్పారు.

ముందుజాగ్రత్తగా పాఠశాలలు ఖాళీ చేయించామని న్యూ సౌత్ వేల్స్ విద్యా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో న్యూ సౌత్ వేల్స్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

>
మరిన్ని వార్తలు