విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. 12 మంది మృతి

10 Jul, 2020 19:23 IST|Sakshi

ఖాట్మండు : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి. కొన్నిచోట్ల న‌దుల‌వెంట ఉన్న ఇండ్లు కొట్టుకుపోయాయి. మ‌రికొన్నిచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ముఖ్యంగా కస్కీ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే 12 మంది మృతిచెందగా మరో 19 మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి.

దీంతో చాలామంది వాటికింద చిక్కుకుపోయారు. అన్ని ప్రాంతాల్లో క‌లిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్‌కోట్‌, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ముమ్మ‌రంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు