శరీరాన్ని రెండు ముక్కలు చేసినా వదల్లేదు

7 Jun, 2018 13:19 IST|Sakshi
రెండు ముక్కలైన రాటిల్‌ స్నేక్‌

టెక్సాస్‌ : పాము పగబడితే పగతీర్చుకునే వరకు వదిలి పెట్టదంటారు. మరి అది నిజమో కాదో తెలియదు కాని అచ్చం అలాంటి ఘటనే టెక్సాస్‌ నగరంలో చోటుచేసుకుంది. శరీరాన్ని రెండు ముక్కలుగా నరికినా వేరుపడిన తలతోనే వ్యక్తిని కాటేసిందో పాము. పాము కాటుకు గురైన ఆ వ్యక్తి చావుతో పోరాడి వైద్యుల పుణ్యమా అని బతికి బట్ట కట్టాడు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌ నగరానికి చెందిన మీలో, జెన్నీఫర్‌లు భార్యాభర్తలు. వాళ్లిద్దరూ ఇంటి పెరట్లో పని చేసుకుంటుండగా జెన్నీఫర్‌కు రాటిల్‌ స్నేక్‌ కంటపడింది. పామును చూసి భయపడ్డ ఆమె చేతిలో ఉన్న కత్తితో పామును రెండు ముక్కలుగా నరికింది. తర్వాత ఆ విషయాన్ని భర్త మీలోకి చెప్పింది.

ముక్కలుగా నరికిన పాము చచ్చిందనుకున్న మీలో దాన్ని పడేయడానికి చేత్తో వేరుపడిన తల భాగాన్ని పట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రాటిల్‌ స్నేక్‌ అమాంతం అతని చేతిపై కాటు వేసింది. దీంతో అస్వస్థతకు గురైన మీలోను జెన్నీఫర్‌ ఆస్పత్రికి తరలించింది. అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించటంతో అతన్ని బతికించటానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జెన్నీఫర్‌ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా పాము కాటుకు గురైన వ్యక్తికి రెండు నుంచి మూడు డోసుల యాంటీ వీనమ్‌ ఇస్తారు. కానీ మీలోకు మాత్రం ఏకంగా 26 డోసులు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ కిడ్నీల పనితీరు కొద్దిగా బాగోలేద’’ని తెలిపింది. 

మరిన్ని వార్తలు