భర్తను పంచుకుంటేనే మంచిదట!

29 Oct, 2015 12:58 IST|Sakshi
భర్తను పంచుకుంటేనే మంచిదట!

బహుభార్యత్వం.. అంటే ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడటం తప్పని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా చేసిన పరిశోధనలో మాత్రం.. కొన్ని పరిస్థితులలో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందట! ప్రపంచంలో చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా ఇది మహిళల పట్ల వివక్షేనంటాయి.

ఈ విషయాన్ని తేల్చేందుకు ఉత్తర టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలాకాకుండా ఒక భర్త ఒకే భార్యతో ఉంటున్న కుటుంబాలపై పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాల్లోనే తగినతం ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారట.

బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద కూడా బాగుందని, మామూలు వాళ్ల కంటే పెద్ద కమతాలలో వీళ్లు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా, 3 ఆవులు, ఒక ఎకరం భూమి ఉన్నవాళ్ల కంటే.. 180 ఆవులు, బోలెడంత భూమితో పాటు కొందరు భార్యలు కూడా ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మోనిక్ బోర్గెరాఫ్ మల్డర్ చెప్పారు.

అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోకుండానే బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల మహిళలకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఎంతమంది భాగస్వాములు ఉండొచ్చన్నది సమస్య కాదని, తాము కోరుకున్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

టాంజానియా లాంటి దేశాల్లో ఆహారభద్రత చాలా సమస్యగా ఉంది. ఇక్కడ పౌష్టికాహారం అందక చిన్నవయసులోనే పిల్లలు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాసాయ్ లాంటి తెగలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.

మరిన్ని వార్తలు