తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి..

24 Mar, 2018 16:57 IST|Sakshi
వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలోని హమెలిన్‌ బీచ్‌ తీరానికి కొట్టుకొచ్చిన వేల్స్‌

పెర్త్‌ , ఆస్ట్రేలియా : వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలోని హమెలిన్‌ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్‌ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి. మృత్యువాత పడ్డ వేల్స్‌ను తినేందుకు షార్క్‌లు ఎగబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక దృశ్యాలను చిత్రీకరించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

నది సముద్రం కలిసే చోట నీటికి ఎదురొచ్చిన వేల్స్‌ గుంపు ఇలా సముద్ర తీరానికి వచ్చి తిరిగి వెళ్లలేక ప్రాణాలు కోల్పోయాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై డెయిలీ మెయిల్‌తో మాట్లాడిన స్థానిక మహిళ.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన వందలాది వేల్స్‌లో తాను చూస్తుండగా మరణించాయని చెప్పారు.

మరికొన్ని నీటిలోకి తిరిగి వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి కంటతడి ఆగలేదని వెల్లడించారు. వాటికి సాయం చేయలేని తన నిస్సహాయతను ఆమె నిందించుకున్నారు. మరణించిన వేల్స్‌ మాంసం కోసం షార్క్‌లు తీరానికి వచ్చాయని చెప్పారు.

తాము ఇచ్చిన సమాచారంతో బీచ్‌ వద్దకు చేరుకున్న రక్షకులు క్రేన్స్‌ సాయంతో కేవలం ఆరు వేల్స్‌ను మాత్రమే రక్షించగలిగారని వివరించారు. మిగిలిన వాటిని రక్షించేలోపే అవి ప్రాణాలు వదిలాయని తెలిపారు. ఒక్కో వేల్‌ నాలుగు టన్నులకు పైగా బరువుందని, అంత భారీ బరువున్న వాటిని సముద్రం లోపలికి(ఒక కిలోమీటర్‌ పాటు) తరలించడం రక్షకులకు కష్టసాధ్యమైందని అన్నారు.

మరిన్ని వార్తలు