ఓ ప్రిన్సిపాల్.. ఇద్దరు అమ్మాయిలు..ఓ ఫైట్

9 May, 2016 10:58 IST|Sakshi
ఓ ప్రిన్సిపాల్.. ఇద్దరు అమ్మాయిలు..ఓ ఫైట్

లండన్: ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవను సర్దుమణిగేలా చేసేందుకు వెళ్లిన ఓ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సమస్యల్లో ఇరుక్కున్నాడు. మరో అమ్మాయితో గొడవ పడుతున్న పదిహేనేళ్ల విద్యార్థిని విడిపించేందుకు ఆ విద్యార్థిని గొంతుదగ్గరపట్టుకొని లాగడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. ఇది కాస్త వీడియో రూపంలో బయటకు రావడంతో పెద్ద రచ్చగా మారి పోలీసుల వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  లండన్ లోని కింగ్ స్ట్రీ సీనియర్ హై స్కూల్లో మాక్ బర్గెస్ అనే అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు.

గత సోమవారం ఇద్దరు విద్యార్థినులు బాగా గొడవపడుతుంటే ఇతర విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అనంతరం తమ చేతుల్లోని సెల్ ఫోన్లు బయటకు తీసి రికార్డు చేయడం మొదలు పెట్టారు. కానీ, వారిని విడిపించేందుకు ఏ ఒక్కరూ వెళ్లలేదు. దీంతో స్కూల్ యాజమాన్యంలో ఒకరైన మాక్ బర్గెస్ ఆ గొడవపడుతున్నవారి వద్దకు వెళ్లి తొలుత ఆపే ప్రయత్నం చేశాడు. మందలించి చూశాడు. అయినా, వారు ఆయన మాట వినకుండా కొట్టుకుంటుండటంతో అందులో పదిహేనేళ్ల విద్యార్థినిని మెడదగ్గరపట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. అలా కొన్ని అడుగుల దూరం వెనక్కిలాగుతూ వెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయింది.

ఈ వీడియో వెలుగుచూడంతో ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. అయితే, తొలుత ఆయనను అరెస్టు చేయాలని చెప్పిన కోర్టు అనంతరం కేవలం నోటీసులు మాత్రం జారీ చేస్తే సరిపోతుందని, వివరణ కోరాలని తెలిపింది. కానీ, ఆ బాలిక తల్లి మాత్రం ఆయనకు శిక్ష పడాలని అంటోంది. గత ఐదురోజులుగా తన కూతురు సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటుందని, ఆ ప్రిన్సిపాల్ తన కూతురును ఈడ్చేసిన విధానం చూస్తుంటే ఓ తల్లిగా ఎంతో బాధకలుగుతుందని, కనీసం మెడ కూడా తిప్పలేకుండా ఉండి మెడిసిన్ వాడుతుందని చెప్పింది.

మరిన్ని వార్తలు